Ardhanarishvara Tatvam : అర్థనారీశ్వర తత్వం అంటే శరీరంలో సగభాగం పంచిఇవ్వడం కాదు
అర్థనారీశ్వర తత్వం అంటే శరీరంలో సగభాగం పంచివ్వడం కాదు. భర్త తీరుని గమనిస్తూ అక్కడ ఎలా ఉండాలో గ్రహించి అలా నడుచుకోవడం. పంచభూత క్షేత్రాల్లో స్వామి, అమ్మవార్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
స్త్రీ... పురుషుడిని బట్టి మారుతుందని-భర్త స్వభావానికి ఆలోచనలకు అనుగుణంగా మారడమే అర్థనారీశ్వర తత్వం అని చెప్పుకోవచ్చంటారు పండితులు. పంచభూత లింగాలు కొలువైన క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అంటే స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు శాంత స్వరూపిణిగా కనిపిస్తారు...స్వామివారు శాంతంగా కొలువైన చోట అమ్మవారు ఉగ్రరూపంలో కనిపిస్తారు.
- అరుణాచలంలో అగ్నిలింగం: ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో ఉంటారు-అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు.
- జంబుకేశ్వరంలో శివుడు జలలింగ..అంటే స్వామివారు శాంతంగా ఉంటారు. అందుకే ఇక్కడ అమ్మవారు ఆగ్రహంగా ఉంటారు. ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ స్వామి శాంత స్వరూపం కావడంతో అమ్మవారు ఆగ్రహంగా కనిపిస్తారు.
- కంచిలో పృథ్వి లింగం....ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. అంటే సున్నితమైన శివుడన్నమాట. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో....భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.
- చిదంబరంలో ఆకాశలింగం...అంటే యజమాని ఇంట్లోలేడు. బయటకు వెళ్లాడని అర్థం. అంటే మళ్లీ రారు అని కాదు. అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటారు. అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పే సంకేతం.
- శ్రీకాళహస్తి వాయులింగం విషయానికొస్తే. వాయువు వేగానికి ప్రతీక. అందుకే ఇక్కడ అయ్యవారి అవసరాన్ని అర్థం చేసుకుని అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది.
అంటే భర్త ప్రవర్తన, అవసరం, ఆపదను ముందుగానే గ్రహించి ఆయనకు అనుకూలంగా మారడమే అర్థనారీశ్వర తత్వం అని చెబుతున్నాయ్ పంచభూతలింగాలు కొలువైన క్షేత్రాలు.
Also Read: పురుషుడు స్థిర స్వభావం- స్త్రీ మాయాస్వరూపం ఇదే అర్థనారీశ్వర తత్వం
తెలుపు శాంతం-నలుపు కోపం
ఇక తెలుపు-నలుపును వేదపరిభాషలో చెప్పుకుంటే తెలుపు అంటే శాంతం-నలుపు అంటే కోపం. భార్య కోపంగా ఉంటే నల్లగా ఉందని- శాంతంగా కనిపిస్తే తెల్లగా ఉందని అంటాడు పరమేశ్వరుడు. తెల్లగా ఉండే స్వరూపాన్ని గౌరి అని, నల్లగా ఉండే స్వరూపాన్ని కాళి అని పిలుస్తారు. ఓ సందర్భంలో అమ్మవారి కోపాన్ని గ్రహించిన స్వామివారు....కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళి...తపస్సు చేసి శాంతస్వరూపిణి అయిన గౌరిగా మారిందని చెబుతారు. అంటే స్థిరచిత్వం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ స్త్రీలో మార్పులు ఉండాలన్నదే అర్థనారీశ్వర తత్వం అసలైన అర్థం. అందుకే ధర్మశాస్త్రంలో స్త్రీకి ఉండే నియమాలు పురుషుడికి ఉండవ్.
Also Read: శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు
అర్థ నారీశ్వర స్తోత్రమ్
చాంపేయ గౌరార్థ శరీరకాయై- కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ- నమశ్శివాయై చ నమశ్శివాయ
కస్తూరికా కుంకుమ చర్చితాయై-చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ
ఝణత్క్వణత్కంకణ నూపురాయై-పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ
విశాల నీలోత్పల లోచనాయై-వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ
మందార మాలా కవితాలకాయై-కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై-నమశ్శివాయై చ నమశ్శివాయ
అంభోధర శ్యామల కుంతలాయై-తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ
ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై-సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే-నమశ్శివాయై చ నమశ్శివాయ
ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై-స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ-నమశ్శివాయై చ నమశ్శివాయ
ఏతత్పఠే దష్టక నిష్టదం యో-భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం-భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః
ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్