Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి!
Kartika Purnima 2023: కార్తీకమాసంలో 365 వత్తులతో దీపం వెలిగించాలని చెబుతారు..ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్క దగ్గర కానీ ఆలయంలో కానీ 364 వత్తులు వెలిగించాలంటారు..ఎందుకో తెలుసా..
![Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి! Kartika Purnima 2023 karthika pournami lamp with 365 wicks pooja in Kartik Purnima behind the reason of 365 vattula deepam Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/42243feb08fb11ebae84356409a2126a1700818814751217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Behind The Reason 365 Vattula Deepam
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు.
మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదని చెబుతారు. కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. ఏకహారతితో కానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఒక వత్తితో దీపం పెట్టకూడదు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తారు.
Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు!
దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపానికి కార్తిక మాసంలో మరింత ప్రత్యేకత ఉంది. సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులు చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు.
లోకానికి వెలుగునీ తేజస్సునీ ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకూ ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే. దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి.
Also Read: క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ!
కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు!
దీపం తమస్సును పోగొడుతుంది. అందుకే తమసోమా జ్యోతిర్గమయా!అని రుషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానాన్నిట్టే ఈ దీపాన్ని కార్తికమాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు పండితులు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. అగ్నికి సూక్ష్మరూపమే దీపం. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడమంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడమేకాదు సమస్త ప్రాణకోటికీ లబ్ధి చేకూర్చడమే. నిత్యం దీపం వెలిగించి దైవాన్ని ప్రార్థించలేనివారు... అగ్ని ఆరాధనకు ముఖ్యమైన కార్తీమాసంలో..ముఖ్యంగా పౌర్ణమి రోజు ఏడాదిలో రోజుకో వత్తు గుర్తుగా 365 వత్తులు వెలిగించాలని చెబుతారు పండితులు.
క్షీరాబ్ధి ద్వాదశి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కీటాఃపతాంగాః మశకాశ్చవృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
కీటకాలూ పక్షులూ వృక్షాలూ జలచరాలపైన నేను వెలిగించిన దీపపు కాంతి ప్రసరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించమని అర్థం. కేవలం నేనూ నా కోసం అనే స్వార్థ చింతనకు తావులేని కార్తిక దీపం వల్ల ప్రకృతిలోని ప్రతిపాణీ తరిస్తుందన్న భావన .
Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!
నిత్య దీపారాధన ముఖ్యం
కార్తీకమాసంలోనే కాదు నిత్యం దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్యదీపారాధన కుదరకపోతే కార్తికమాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తిక సోమవారాలూ, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలు వెలిగించమని చెబుతారు. ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తిక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవునేతితో దీపం పెట్టడం అన్నింటికన్నా శ్రేష్టం. అలాగే నువ్వుల నూనెనూ ఉపయోగించవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)