Karthika Masam 2022: ఏపీ వ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు!
Karthika Masam 2022: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు దీపారధానలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Karthika Masam 2022: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారు మోగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, పెదకాకాని ఆలయాలకు వేకువ జాము నుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తల దీపారాధన చేస్తున్నారు. ఆ శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. శివకోటి గ్రామంలో శ్రీ రాముడు ప్రతిష్టించిన శివకోటి లింగాలలో... కోటి లింగంగా ప్రసిద్ధి చెందిన శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. శివయ్య కు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి.
పల్నాడు జిల్లా అరావతి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు.
సోమవారం మరింత ప్రత్యేకం..
కార్తీకమాసంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు ఉపవాసం ఉంటే అత్యుత్తమ ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరించినవారు, శక్తి ఉన్నవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడుకి యధాశక్తి పూజచేసి..నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యం సహకరించకపోయినా కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్లు ఏక భుక్తము పాటించవచ్చు. ఉదయాన్నే స్నానం , పూజ పూర్తిచేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి వేళ భోజనానికి బదులు తీర్థం తీసుకోవచ్చు.
కార్తీక మాసంలో వనభోజనాల ప్రత్యేకత..
అలాగే కార్తీకమాసంలో చాలా మంది వనభోజనాలకు వెళ్తుంటారు. కార్తీకమాసంలో శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం. అయితే పచ్చని చెట్లు , ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు , బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని చెబుతారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట , పాట కబుర్లకు చక్కటి వేదిక. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యలు చెబుతారు. ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది.