Srirama Navami 2022 : ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 9న అంకురార్పణ
Srirama Navami 2022 : ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 15న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.
Srirama Navami 2022 : కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శనివారం(ఏప్రిల్ 9న) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 10న ధ్వజారోహణం, 15న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9న సాయంత్రం అంకురార్పణ జరగనుంది. శనివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.
ఏప్రిల్ 10న ధ్వజారోహణం :
ఏప్రిల్ 10న ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వృషభలగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు :
ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుంచి 19వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ధార్మికోపన్యాసం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో భక్తి సంగీతం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం, రాత్రి వాహనసేవల్లో కళాబృందాలు భజనలు, కోలాటాలు తదితర కళారూపాలను ప్రదర్శిస్తారు.
కవి సమ్మేళనం, సాహితీ సదస్సు
ఏప్రిల్ 10న బమ్మెర పోతన జయంతి సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న శ్రీరామపట్టాభిషేకం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాహితీ సదస్సు జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు
- 10-04-2022(ఆది) ధ్వజారోహణం(ఉ. 8-9గం.ల)(వృషభ లగ్నం), పోతన జయంతి, శేషవాహనం.
- 11-04-2022(సోమ) వేణుగాన అలంకారం, హంస వాహనం.
- 12-04-2022(మంగళ) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం.
- 13-04-2022(బుధ) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ.
- 14-04-2022(గురు) మోహినీ అలంకారం, గరుడసేవ.
- 15-04-2022(శుక్ర) శివధనుర్భంగాలంకారం, సీతారాముల కల్యాణం (రా.8 గం.లకు), గజవాహనం.
- 16-04-2022(శని) రథోత్సవం.
- 17-04-2022(ఆది) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.
- 18-04-2022(సోమ) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా. 7 గం)
- 19-04-2022(మంగళ) పుష్పయాగం(సా. 6 గం).