Jaya Ekadashi 2024 in Telugu : జయ ఏకాదశి - ఈ రోజు ఇలాచేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి!
మాఘమాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఇదే రోజు భీష్మ పితామహుడు మోక్షం మోక్షం పొందిన తర్వాత వచ్చే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశికి పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది.
Jaya Ekadashi 2024 Date and Significance
జయ ఏకాదశి తిథి
ఫిబ్రవరి 19 సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏకాదశి తిథి ప్రారంభమైంది..
ఫిబ్రవరి 20 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఏకాదశి తిథి ఉంది.
సూర్యోదయానికి తిథి ప్రధానం అందుకే..జయ ఏకాదశిని మంగళవారమే జరుపుకుంటారు.
ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించినా, విష్ణు సహస్రనామం చదివినా - విన్నా అత్యుత్తమ ఫలితం పొందుతారని పండితులు చెబుతారు.
Also Read: ఈ రాశులవారు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి
జయ ఏకాదశి విశిష్టత
ఓసారి దేవతలు స్వర్గంలోని నందన్ అడవిలో ఒక ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఋషులందరినీ ఆహ్వానించారు. ఈ ఉత్సవంలో గంధర్వ బాలికల నృత్యం, గానం కార్యక్రమం నిర్వహించారు. పండగ సమయంలో, పుష్యవతి అనే నర్తకి.. మాల్యవాన్ అనే గంధర్వుడిని చూసి ఇష్టపడింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టి పండగలో ఉన్నారని కూడా గమనించకుండా ఇద్దరూ తమ పరిమితులను దాటి ఒకరికొకరు దగ్గరయ్యారు. అది చూసి ఉత్సవానికి హాజరైన వారంతా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఇంద్రుడు వారిని శపిస్తాడు. ఇక నుంచి స్వర్గంలో వారికి చోటు లేదని.. పిశాచ లోకంలో విహరిస్తారని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ మోక్షం కోసం హిమాలయ శ్రేణులలో పిశాచాల రూపంలో సంచరించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారిద్దరూ శాప విమోచనం పొందాలంటే ఏం చేయాలని నారదుల వారిని ఆశ్రయించారు. అలా మాఘమాసంలో శుక్ల పక్షం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ధ్యానించి పిశాచ జాతుల నుంచి విముక్తి పొందుతారు. అందుకే జయ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారి పూర్వీకులు పిశాచ జన్మల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.
జయ ఏకాదశి రోజు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. విష్ణు చాలీసా , విష్ణు సహస్రనామం పఠించినా విన్నా మంచి ఫలితం పొందుతారు.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
ఈ రోజే భీష్మ ఏకాదశి
భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టవసువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ..దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం కోసం అంపశయ్యపై వేచి ఉన్నాడు. తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు భీష్ముడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా...తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యడానికి అంగీకరించలేదు. భీష్ముడిలో ఉన్న మరో కోణం అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణ మాత్రంగానే పరమాత్మ భౌతికరూపంతో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తుల్లో భీష్ముడు ఒకడు. అయితే అందరిలా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్భంలో… అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావలసింది ఏముందంటూ పరమాత్మకు సాగిలపడ్డాడు.
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన ఏకాదశి
తన నిర్యాణానికి తానే సమయం నిర్ణయించుకున్నాడు. అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే విష్ణు సహస్రనామం. రాజ్యపాలన చేయాల్సిన ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. మాఘ శుద్ధ అష్టమి రోజు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి”, “మహాఫల ఏకాదశి”, “జయ ఏకాదశి” అని అంటారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా.. ఎప్పుడు విన్నా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయని పండితులు చెబుతారు.