విజయానికి విదురుడు చెప్పిన సులభ మార్గాలివే, ఇవి పాటిస్తే మీరే నెంబర్ వన్!
విజయం అందరికిీ ఇష్టమే. విజయాలు సాధించిన వారు కూడా చాలా మందే ఉంటారు. కానీ నిరంతరాయంగా విజయ పథాన పయనించాలంటే విజయాన్ని జీవిత పర్యంతం నిర్వహించడానికి విదురుడు చూపిన మార్గాలు చాలా సులభం అవేమిటో చూద్దాం.
విదుర నీతి ప్రకారం విజయం సాధించడం గొప్ప విషయం కాదు. కానీ ఆ విజయపథంలో కొనసాగడం అత్యంత కష్టమైన విషయం. ఏ విషయంలో నైనా విజయం సాధించాలంటే పనిలో దిగడానికి క్షుణ్ణంగా పరిశోధించి పని ప్రారంభించాలి. అలా పూర్తిగా సన్నధ్ధంగా ఉన్నపుడు విజయం సాధించడం సులువు అవుతుంది.
ఆరంభ శూరత్వం కూడదు
మనలో చాలా మంది పని మొదలవడానికి ముందు ‘‘ఇదేముంది చేసేస్తాం లే’’ అనుకుని మొదలు పెడతారు. కానీ గోదాలో దిగిన తర్వాత కానీ విషయం అర్థం కాదు. ముందుకు సాగే కొద్దీ ఆటంకాలు ఎలా ఉంటాయనేది అర్థం అవుతూ ఉంటుంది. అలా కష్టాలు మొదలవగానే డీలా పడిపోయి ఓటమిని అంగీకరించి ప్రారంభించిన పనిని అక్కడితో ఆపేస్తారు. వీరీనే ఆరంభ శూరులు అంటారు. ఇలాంటి వారు దేనిలోనూ విజయం సాధించలేరు. ఒక వేళ యాదృశ్చికంగా సాధించినా ఆ విజయాన్ని నిలబెట్టుకోలేరు. ఎన్ని ఆటంకాలెదురైనా వాటన్నింటిని తెలివిగానో, శక్తి యుక్తులను ఉపయోగించో అధిగమించి చేపట్టిన పని పూర్తి చేయ్యాలని విదుర నీతి చెబుతోంది.
కాలానికి విలువనివ్వాలి
కాలం చాలా విలువైందని మనందరికి తెలుసు. చేజారిన ఏ క్షణాన్ని తిరిగి అనుభవించడం సాధ్యం కాదు. కనుక కాలయాపన అయినా, సరైన సమయంలో స్పందించక పోవడం అయినా కాలానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదనే అర్థం. సమయపాలన గెలుపుకు మొదటి అడుగు అని చెప్పుకోవచ్చని విదుర నీతి చెబుతోంది. అందుకే ప్రతి క్షణం విలువైనదే. విలువైన ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే వాడే విజయానికి చేరువవుతాడు.
ఉద్వేగ నిర్వహణ అతి ముఖ్యం
ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన వారికి ఆలోచనల మీద నియంత్రణ ఉంటుంది. అందువల్ల లక్ష్య సాధనలో ఎదురైన ఒడిదొడుకులను ఎదుర్కోవడం సులభం అవుతుంది. ఇలా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగే వారు లక్ష్య బద్ధులై ఉండగలరు. అందువల్ల విజయ సాధన సులభం అవుతుంది. హృదయం సన్నధ్ధంగా లేకపోతే విజయ సాధన కుదరని పని అని విదుర నీతి చెబుతోంది.
నిరంతర అధ్యయనం
జీవితం ఏ క్షణంలో ఎటువంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. దేనికైనా సిద్ధంగా ఉండాలంటే నిరంతరాయంగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అనే విషయం అవగాహనలో ఉండాలి. ఇది గెలుపుకు మరో సూత్రం. కనుక జీవితంలోని ఏ స్థాయిలో అయినా సరే నేర్చుకోవడాన్ని ఆపకూడదు. ఎప్పుడూ నేర్చుకుంటూ అప్ డేట్ అవుతూ ఉండడం ద్వారా విజయం సాధించడం సాధించిన విజయాన్ని కొనసాగించడం సాధ్యపడుతుంది.
ఆనందం అన్నింటికి ముఖ్యం
నిత్య దుఃఖంతో ఉండేవాడు జీవితంలో విజయం సాధించలేడు. సంతోషం లేని వాడికి మనఃశాంతి దూరం అవుతుంది. అటువంటి మానసిక స్థితి నిర్ణయాలకు అనుకూలం కాదు. కనుక విజయం సాధించడం కష్టం అవుతుంది. ఎంత వరకు కష్టాలను మనసు మీదకు తీసుకోకుండా జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులా గడుపుతారో వాళ్లు మాత్రమే విజయాలను సులువుగా అందుకుంటారని విరుదనీతి చెబుతోంది. నిరాశ పూరిత ఆలోచనలు లక్ష్యాల పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఆత్మ విశ్వాసం ముఖ్యం
మీరు ఎవరి కంటే తక్కువ కాదు అనే నమ్మకం మీ మీద మీకు ఉంటే కచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీన్నే ఆత్మ విశ్వాసం అంటారు. అయితే అతి విశ్వాసం కూడదు. అది తప్పకుండా మీ చేత తప్పుడు నిర్ణయాలు చేయిస్తుంది. మీరు ఎవరికంటే తక్కువ కాదు కానీ నన్ను మించిన వారు లేరనే ధోరణి కూడా అపజయాల పాలు చేస్తుంది. కనుక అటువంటి అహంకారం కూడదని విదురనీతి చెబుతోంది. మీ విషయంలో మీ అంచనా సరైనదైతే మీ పరిమితులు మీకు సరిగ్గా అర్థం అవుతాయి. అది మీకు అన్ని రకాలుగా విజయానికి కారణం అవతుంది.
ప్రణాళిక ముఖ్యం
చిన్న పనికైనా మంచి ప్రణాళిక అవసరం. అప్పుడే ఆ పని అనుకున్న సమయానికి విజయవంతం అవుతుంది. ప్రణాళిక అమలులో చాలా నిక్కచ్చిగా వ్యవహరించాలి. బద్ధకం అసలు కూడదు. ఇది అన్నింటికంటే పెద్ద జబ్బు దీన్ని జయించిన వాడికి విజయం తధ్యం అని విదుర నీతి చెబుతోంది. విజయవంతుల కథల్లో ఓటములు కూడా ఉంటాయని గ్రహించాలి. ఓటమి భయంతో పనులు ప్రారంభించకూడదు. ఓడినా ప్రయత్నం వీడని వాడు సగం విజయం సాధించినట్టే అని విదురుడు ఉద్భోదించాడు.
Also Read: భార్య అందంగా ఉంటే అదృష్టమా? విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసా?
Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?