Navratri 2025: కాళికా దేవి భయంకరమైన రూపం వెనుక దాగి ఉన్న అసలు రహస్యమిదే!
Kali Maa: కళకళలాడే ముఖారవిందం, వళ్లంతా నగలు, పూల అలంకారంతో అమ్మవారి రూపం పూజ్యనీయంగా ఉంటుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది కాళికాదేవి రూపం. ఇంతకీ ఆ రూపం వెనుకున్న అంతరార్థం తెలుసా?

Most Powerful Goddess in Hinduism : శక్తి స్వరూపిణి అవతారాల్లో చాలా ప్రత్యేకమైనది కాళిక. జగత్తులోని బ్రహ్మాండశక్తికి ప్రతీక కాళి రూపం. వెల్లకిలా పడుకున్న శివునిపై నిలబడినట్లు ఆమెను చిత్రీకరిస్తారు. ఏ మార్పూ చెందని బ్రహ్మానికి ప్రతీక శివుడు. ఆయన శాంతంగా, ఆత్మలీనుడై ఉంటాడు. విశ్వంలో చోటు చేసుకుంటున్న ప్రతి పరిణామానికి శివుడే ఆధారం అని తెలియజేస్తుంది శివశక్తులు కలసి ఉన్న ఈ రూపం.
కాళిక రంగు ముదురు నీలం లేదా కృష్ణవర్ణం
రంగులన్నీ తనలో ఇముడ్చుకుంటే వచ్చే రంగు ఇది
అంటే..అన్నీ రంగులూ కాళికలో ఉన్నాయ్..ఇది అనంతతత్వానికి ప్రతీక
దూరం నుంచి చూస్తే ఆకాశం , నీరు నీలంగా కనిపిస్తాయ్..కానీ దగ్గరకు వెళితే వాటికి ఆ రంగు ఉండదు. అలా దూరం నుంచి చూస్తే కాళికాదేవి నీలవర్ణంలో
కనిపిస్తుంది..కానీ ఆమెను దగ్గరగా చూడగల సాధన మీకుంటే వర్ణరహితం అని అర్థమవుతుంది.
కాళిక అనంతరూపిణి..అనంత తత్వాన్ని దేనితోనూ కప్పలేం..అందుకే ఆమె దిగంబరి ..దిక్కులే ఆమె అంబరాలు (వస్త్రాలు)
పొడవైన ఒత్తైన శిరోజాలను విరబోసుకుని ఉంటుంది అందుకే ముక్తకేశి అంటారు. ఒక్కో శిరోజం ఒక జీవికి ప్రతీక
రక్తమోడుతూ, చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది
తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కిపెట్టి ఉంచుతాయి..అంటే మనసులో చంచల స్వభావాన్ని సత్వగుణంతో అదిమిపెట్టాలనే సంకేతం
వామహస్తంలో ఉన్న ఖడ్గం, తెగిన మానవ శిరస్సు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని చెప్పేందుకు సూచన
కాళిక ధరించే మాలలో 50 శిరస్సులు ఉంటాయి. సంస్కృత భాష 50 అక్షరాలతో కూడి ఉంటుంది. ఈ అక్షరాలే శబ్దానికీ, భాషకూ పునాది.
కాళిక 3 కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీక. నడుము చుట్టూ తెగిన చేతులతో మేఖల, నెత్తురు ఓడుతున్న నాలుక, క్రింది వామహస్తంలో శిరస్సు, పై చేతిలో ఖడ్గం, కుడివైపు వరదాభయహస్తాలు..ఇవన్నీ ఓ వైపు భీషణం మరోవైపు కారుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ ఓ వైపు వైభవోపేతంగా , మరోవైపు భయాన్నికలిగించేవిగా ఉంటాయి. జగన్మాతకు తన సంతానం పట్లఉన్న ప్రేమను, బాధ్యతను సూచిస్తాయి.
ఈ సృష్టిలో ఉండే విద్య-అవిద్య, జీవనం-మరణం, అందం-వికృతం, శుభం-అశుభం ఇవన్నీ మనుషులను ఉక్కిరిబిక్కిరి చేసే ద్వాందాలు. ఇవన్నీ ఆమె అద్భుతాలే..జగత్తులో ఆమె కన్నా ఏదీ భిన్నంకాదు. సమస్తానికి ఆదిమూలం ఆమె... ఇదే కాళిక రూపం వెనుకున్న ఆంతర్యం.
కాళిక ధ్యానం
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం
హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్
ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















