Heramba Sankashti Chaturthi 2024: శ్రావణమాసం సంకటహర చతుర్థి పూజ ఎలా చేయాలి - ఎందుకు చేయాలి!
Heramba Sankashti Chaturthi 2024: తెలుగు నెలల ప్రకారం ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే చవితిని సంకటహరచతుర్థి అంటారు. చవితి తిథి సాయంత్రానికి ఉండేలా చూసుకుని ఈ వ్రతం ఆచరిస్తారు.
Sankatahara Chaturthi for August 2024: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విఘ్నాధిపతిని కోరుతూ చేసే వ్రతమే సంకటహర చతుర్థి. సాధారణంగా చేపట్టే పనుల్లో ఎలాంటి అటంకాలు ఉండకూడదనే వినాయకుడిని ముందుగా ప్రార్థిస్తారు.
గణనాధుడికి 32 రూపాలు ఉన్నాయి..అందులో ఆఖరి రూపమే చతుర్థి రోజు పూజించే రూపం. ఈ రూపంలో వినాయకుడి కుడచేయి వరదహస్తం, ఎడమచేతిలో పాయసపాత్ర ఉంటుంది.
తెలుగు నెలలు 12...అంటే ఏడాదికి 12 సంకష్ట హర చతుర్థిలు వస్తాయి. ఏ నెలలో అయినా పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణమాసంలో సంకట హర చతుర్థి ఆగష్టు 22 గురువారం వచ్చింది. మొత్తం 12 చవితి రోజుల్లో ఏ రోజైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
సంకష్ట హర చతుర్థి వ్రతం ఎందుకు చేయాలి?
- ఏ పని ప్రారంభించినా కలసి రానప్పుడు...అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితం పొందుతారు.
- వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో కష్టాలు వెంటాడినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు
- దృష్టిదోషం, నరఘోష ఉందని నమ్మేవారు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఆ దోషాలు తొలగిపోతాయి
- ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు, ఆర్థికంగా మరో అడుగు ముందుకు పడేందుకు, మంచి ఆలోచన కల్పించేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుంది
- వివాహానికి సంబంధించిన అడ్డంకులు, సంతాన సమస్యలు ఉన్నవారు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించవచ్చు
- దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా సంకటహరచతుర్థి వ్రతం చేస్తే ఆరోగ్యవంతులవుతారు
- కొన్నిసార్లు అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది..తప్పుచేయకపోయినా పదే పదే ఇదే జరుగుతుంటుంది..ఈ కష్టం నుంచి ఉపశమనం కల్పిస్తుంది సంకట హర చతుర్థి వ్రతం
Also Read: ఆగష్టు 22 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు నూతన వాహన యోగం , ఆర్థిక లాభం!
సంకష్ట హర చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలి?
సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని ప్రధానంగా తీసుకుంటాం. కానీ సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలంటే తిథి సూర్యాస్తమయం సమయం ..అంటే.. చంద్రోదయ సమయానికి ఉండాలి. అందుకే శ్రావణమాసంలో ఆగష్టు 22న సంకట హర చతుర్థి వ్రతం ఆచరించాలి. చవితి తిథి.. ఆగష్టు 22 సాయంత్రం 6 గంటల 10 నిముషాల నుంచి ప్రారంభమైంది... అంటే చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉంది. ఈ రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి...మీరు ఏ సమస్య నుంచి అయితే బయటపడాలని కోరుకుంటున్నారో దాన్ని తలుచుకుని వినాయకుడికి నమస్కరించి..ముడుపు కట్టాలి
ముడుపు అంటే ఏం ఉండాలి?
వినాయకుడికి కట్టే ముడుపులో భాగంగా..ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో పసుపు, కుంకుమ, మూడు దోసిళ్ల బియ్యం, వక్కలు, ఎండు ఖర్జూరం, తాంబూలం, దక్షిణ వేసి ఆ ముడుపుని గణనాథుడి దగ్గర పెట్టాలి. 21 సార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో కోర్కెను చెప్పుకోవాలి. రోజంతా ఉపవాసం ఆచరించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అల్పాహారం తీసుకోవచ్చు. సంకట హర చతుర్థి వ్రతంలో భాగంగా మౌన వ్రతం కూడా చేయాలి. ఇక్కడ మౌన వ్రతం అంటే..మాట్లాడకుండా ఉండిపోవడం కాదు...అనవసర చర్చలు చేయకూడదని అర్థం. ఉపవాసం అనంతరం సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. మర్నాడు దానధర్మాలు నిర్వహించాలి. అవకాశం ఉంటే గణపతి హోమం చేసుకుంటే ఇంకా శుభపలితాలు.
Also Read: మన దేశంలో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు..ప్రతి ఆలయం ప్రత్యేకమే!
సంకష్ట హర చతుర్థి ఇలా చేయాలి
ఏ పూజలో అయినా సాధారణంగా అచమనం, సంకల్పం, కలశారాధన ఉంటుంది. ఇవి పూర్తైన తర్వాత సంకష్టహర గణపతి షోడసోపచార పూజ చేయాలి. వినాయకచవితి రోజు పూజా విధానంలా అంగపూజ, ఏకవింశతి పుష్పపూజ, ఏకవింశతి పత్రి పూజ, అష్టోత్తరం, సంకట నాశన గణేష స్తోత్రం , గౌరీపూజ , పంచోపచార పూజ ఆచరించాలి. ధూపం, దీపం నైవేద్యం సమర్పించి గరికెతో పూజ పూర్తిచేసి వ్రత కథ చదువుకోవాలి.