Hanuman Jayanti 2024 Date: జూన్ 1 శనివారం హనుమాన్ జయంతి - తిరుమల, కొండగట్టులో ప్రత్యేక ఏర్పాట్లు!
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. తెలంగాణలో చైత్ర పౌర్ణమిరోజు , ఆంధ్రప్రదేశ్ లో వైశాఖ దశమి రోజు, తమిళనాడు - కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో జరుపుకుంటారు...
Hanuman Jayanti 2024 Date: భక్తికి, మనోబలానికి, జ్ఞానానికి సంకేతంగా హనుమంతుడిని స్మరించుకుంటారు భక్తులు. అంతులేని పరాక్రమశాలి అయిన హనుమంతుడు తన బలం కన్నా శ్రీరాముడిపై భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయుడికి శ్రీరాముడంటే ఎంత భక్తి అంటే తనమనసునే మందిరంగా చేసుకుని ఆరాధించాడు. రాముడిని సీతమ్మకన్నా మిన్నగా ఆరాధించాడు హనుమాన్. ఓసారి సీతమ్మ నుదిటిన సింధూరం పెట్టుకోవడం చూసి ఎందుకు అని అడిగితే...భర్త దీర్ఘాయుష్షు కోసం అని బదులిచ్చింది సీతమ్మ. వెంటనే హనుమంతుడు తన ఒళ్లంతా సింధూరం పూసుకున్నాడు. అదీ రామంచంద్రుడిపై ఆంజనేయుడికి ఉన్న భక్తి. ఓ సందర్భంలో సీతాదేవి ఇచ్చిన రత్నాలహారంలో ఒక్కోపూసను చూసి విసిరేయసాగాడు... ఎందుకిలా చేశావు హనుమా అంటే ఇందులో రాముడు ఉన్నాడేమో అని చూశాను..తన స్వామి లేని రత్నాలు, స్వర్ణాలు ఎందుకు అని బదులిచ్చాడు. సీతదేవి జాడ తెలుసుకోవడం మొదలు రావణసంహారం ...ఆ తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం వరకూ రాముడి వెన్నంటే ఉన్నాడు హనుమాన్. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడిని ఆరాధిస్తే ధైర్యం, బలం, ఆత్మస్థైర్యం కలుగుతాయని.. ఆందోళనలు దూరమవుతాయని...కీర్తిప్రతిష్టలు పెరుగుతాయని భక్తుల విశ్వాసం...
శ్లోకం
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
Also Read: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
2024 లో హనుమాన్ జయంతి జూన్ 1 శనివారం వచ్చింది. ఈ సందర్భంగా తిరుమల సహా కొండగట్టు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జూన్ ఒకటవ తేదీ నుంచి ఐదు వరకూ ...ఐదు రోజులపాటు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, అంజనాద్రిలో కొలువైన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీన మల్లెపూలతో, జూన్ రెండో తేదీన తమలపాకులతో, మూడో రోజు ఎర్రగన్నేరు , కనకాంబరాలు.. నాలుగోరోజు చామంతి పూలతో...ఐదో రోజు సింధూరంతో అభిషేకం చేస్తారు. జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నం హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేస్తారు.
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టులో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు భారీగా తరలి వస్తున్నారు. రామనామస్మరణలో కొండగట్టు మారుమోగిపోతోంది. దీక్షాపరులకోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయి బ్రహ్మణులను నియమించారు. కొండపైకి చేరేందుకు RTC 4 ఉచిత బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల తరపున అంజన్నకు భద్రాద్రి పధాన అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు.
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి||
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు