Ganesh Visarjan 2024: ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ఎప్పుడు? నిమజ్జనానికి మంచి మూహూర్తాలు ఇవీ
Ganesh Nimajjanam 2024 | వినాయక చవితితో మొదలైన గణేష్ నవరాత్రులు నిజ్జనంతో ముగుస్తాయి. ఈ ఏడాది నిమజ్జనం ఎప్పుడూ? అసలు ఎందుకు నిమజ్జనం చేస్తారు? మూహూర్తం ఏమిటి?
Ganesh Visarjan 2024 News | దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం మన ఆనవాయితి. గణేష్ చతుర్థి తో మొదలయ్యే ఈ ఉత్సవాలు 9 నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతీ ఊరూ, ప్రతి పట్టణం, ప్రతి వీధి గణేష్ మంటపాలతో ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో. ఈ ఏడాది కూడా అంతే ఉత్సాహంగా, అంతే అందంగా, ఆనందదాయకంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒకొక్కటిగా గణేష్ విగ్రహాల విసర్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భాద్రపద చవితి నాడు మొదలైన ఈ ఉత్సవాలు 3, 5,7,9,11 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితి. చవితికి పదకొండో రోజయిన అనంత చతుర్ధశిని వినాయక ఉత్సవాలకు ముగింపు రోజుగా పరిగణించవచ్చు.
ఈ ఏడాది నిమజ్జనం ఎప్పుడు?
ఈ ఏడాది హైదరాబాద్ లో సెప్టెంర్ 16 మధ్యాహ్నం నుంచి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమై తెల్లవారి అంటే సెప్టెంబర్ 17 అర్థరాత్రి వరకు నిమజ్జన కార్యక్రమాలు జరపబోతున్నారు. సెప్టెంబర్ 17 న నిమజ్జనానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.04 నిమిషాల వరకు ఒక ముహూర్తం కాగా మధ్యాహ్నం 3.36 నుంచి 5.07 వరకు మరోకటి, సాయంత్రం 8.07 నుంచి 9.30 వరకు ఇంకొకటి, రాత్రి 11.04 నుంచి 3.30 వరకు చివరి ముహుర్తం. ఇది ప్రాంతానుసారంగా లెక్కగట్టి పండితులు నిర్ణయిస్తారు. ఆయా స్థానిక పంచాంగాన్ని అనుసరించి, ప్రాంతాలను బట్టి చిన్నచిన్న మార్పులు ఉండవచ్చు.
నిమజ్జన ప్రక్రియ చివరి పూజతో ప్రారంభం అవుతుంది. భక్తులు వినాయకుడికి పూజ చేసి పూలూ, నైవేద్యాలు సమర్పించి మంటపం నుంచి విగ్రహాన్ని కదిలించి అలంకరించిన శకటాల్లో ఊరేగింపుగా నిమజ్జనానికి బయలు దేరుతారు. మేళతాళాలలో, నృత్య నాట్యాలతో అత్యంత వైభవోపేతంగా గణేష విగ్రహాలు జలశయాలకు చేరుకుంటాయి. ఊరంతా గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో మారుమోగి పోతుంది. ఉత్సవశకటాలు జలశయాలను చేరుకున్న తర్వాత గణపతి విగ్రహాలను అందులో నిమజ్జనం చేయడంతో ఉత్సవ పరిసమాప్తి జరిగినట్టుగా భావించాలి.
అనంత చతుర్ధశి ప్రాముఖ్యత? ఈ రోజే నిమజ్జనం ఎందుకు?
భాద్రపద శుక్లపక్ష చతుర్ధశిని అనంత చతుర్ధశి పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజునే వినాయక నిమజ్జనానికి ఉత్తమమైన రోజుగా చెప్పవచ్చు. భాధ్రపద శుక్లపక్ష చవితి నాడు మొదలైన గణేష్ ఉత్సవాలకు ముగింపు రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున గణేషుడికి సంప్రదాయబద్దంగా వీడ్కోలు పలుకుతారు. వచ్చే ఏడాది తిరగి స్వాగతం పలకాలంటే ఈ ఏడాది ఆయనను కైలాసానికి పంపెయ్యాలని భక్తుల నమ్మకం.
అంతేకాదు ఈ రోజున విష్ణు మూర్తికి కూడా ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. విష్ణుమూర్తిని ఆరాధనతో అనంతమైన సుఖ సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది. విష్ణుమూర్తి అనంత రూపాన్ని ఆరాధించుకునే ఈరోజున వినాయక నిమజ్జనం జరగడం వల్ల ఆయన శక్తి కూడా విశ్వవ్యాపితం అవుతుందనే నమ్మకం. ఈ పదిరోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడు తిరిగి తన స్వస్థానమైన కైలాసం చేరుకునేందుకు అనువుగా భక్తులు మానసికంగా కూడా సంసిద్ధలై ఉంటారు. కనుక ఆరోజునే నిమజ్జనం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఏడాది పాటు విఘ్న రహిత జీవితం గడిపేందుకు ఈ పదిరోజుల విఘ్ననాయకుడి ఆరాధన భక్తులకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.