Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Madanapalli News: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగిన ఫైల్స్ దగ్థం కేసులో తొలి అరెస్ట్ నమోదైంది. ఆరు నెలల తరువాత చోటు చేసుకున్న ఈ పరిణామం తో మరెందరు అరెస్టు అవుతారో చూడాలి
Madanapalli sub collectorate News: మదనపల్లి: చిన్నపాటి ప్రమాదం అనుకున్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కదలాల్సి వచ్చింది. అప్పటివరకు ప్రమాదం అనుకున్న వారే ఇది ప్రమాదం కాదు కుట్ర కోణం అనేది తెరమీదకు వచ్చింది. ఆరు నెలల పాటు సాగిన విచారణ లో తొలి అరెస్ట్ నమోదైంది. ఇంకా ఎంత మంది పై చర్యలు ఉంటాయో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం..
అది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం.. రాష్ట్ర మొత్తం కూటమి ప్రభుత్వం భారీ విజయం తో సంబరాలు చేసుకుని ఎప్పుడు ఎప్పుడు తమ నాయకులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురుచూస్తున్న రోజు. అదే జూలై 21వ తేదీ 2024.. సరిగ్గా అదే రోజు వేకువజామున అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని ఫైల్స్ ఉండే గదిలో మంటలు చెలరేగి భూములకు సంబంధించిన పలు రికార్డులు అగ్గి కి ఆహుతి అయ్యాయి. ఇదంతా ప్రమాదం అనుకున్నారు. అదే కోణంలో చూశారరు.
డీజీపీని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఆయన అందులో ఏదో కుట్ర కోణం దాగి ఉందని గ్రహించి వెంటనే రాష్ట్ర డీజీపీని, సీఐడీ చీఫ్ ను హెలికాప్టర్ ద్వారా మదనపల్లెకి పంపారు. అంతే రాష్ట్రం మొత్తం అసెంబ్లీ టూ మదనపల్లె వైపు చూసింది. పోలీస్ శాఖ లోని పలు విభాగాలు వివిధ కోణాల్లో విచారణ చేసి ఇది ప్రమాదం కాదు... కుట్ర కోణం గా భావిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.
6 నెలలు విచారణ
ప్రమాదం జరిగింది సోమవారం వేకువజామున. ఆదివారం కార్యాలయం సెలవు ఉంటుంది. అయిన కూడా అక్కడీపని చేసే సీనియర్ అసిస్టెంట గౌతమ్ తేజ ఆదివారం రాత్రి వరకు కార్యాలయంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన వారం ముందు నుంచి సీసీ కెమెరాలు కూడా పని చేయలేదు. దీంతో మొత్తం 9 కేసులు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు. ఆగస్టు 6న సీఐడీ అధికారులకు కేసు ను అప్పగించారు. సీఐడీ చేతికి ఫైల్స్ చేరినప్పటి నుంచి కేసు విచారణ వేగం పెంచుకుందాం. సుమారు ఆరు నెలల పాటు సాగిన విచారణ లో ఇందులో కీలకంగా ఉన్న వ్యక్తులను అనుమానితులు గా చేర్చారు.
వైసీపీ నాయకుల పాత్రపై అనుమానాలు
గత ప్రభుత్వ హయాంలో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతో ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో వేల ఎకరాలు వైసీపీ నాయకులు, వారి బంధువుల పేరుతో మార్చారని అధికార కూటమి పార్టీ ఆరోపణలు చేసింది. అదే నిజం అనేలా పుంగనూరు పరిధిలోని అటవీ శాఖ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పేరు పైకి మార్పు చేసినట్లు ప్రకటించారు. ఇలాంటి అనేక ఎకరాల విలువైన భూములను ఆక్రమించి అది బయట పడుతుందనే ఈ మదనపల్లె ఫైల్స్ ప్రమాదం జరిగిందనేది పోలీసులు కేసు నమోదు చేసిన వాటిలోని వెనుక కథ.
ఈ కేసులో ప్రదానంగా ఉన్న వారిని ఇప్పుటికే పలు దఫాలు విచారణ చేశారు. కొందరి ఇళ్ళల్లో సోదాలు చేసి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అధికారులు, స్థానిక నాయకులు, మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలక మైన వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. ఈ కేసుకు సంబంధించి అతనిని బంగారుపాళ్యెంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్తూరు కోర్టు లో హాజరుపరిచారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నెక్ట్స్ ఎవరి పై చర్యలు ఉంటాయి.. ఎవరిని అరెస్టు చేయనున్నారు.. మరెంత మంది ఇందులో ఉన్నారనే విషయాలపై చర్చ నడుస్తోంది.