Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Hyderabad New Year Celebrations: నూతన సంవత్సరం సమీపిస్తుండడంతో హైదరాబాద్ లో రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీటిని ప్రజలు కచ్చితంగా పాటించాలన్నారు.
Traffic Restrictions In Hyderabad: కొత్త సంవత్సరం సందడి మొదలైంది. న్యూ ఇయర్ వేడుకలకు దేశం మొత్తం సిద్ధమవుతోన్న ఈ సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి, భద్రతలకు ఆటంకం లేకుండా సంబరాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదమున్నందున నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని నిశ్చయించుకున్నారు.
న్యూఇయర్ వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాచకొండ పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేయనున్నారు. ప్రయాణికులు, ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి 11గంటల నుంచి జనవరి 1, 2025 తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి నిలిపివేయనున్నట్టు ప్రకటింటారు. మీడియం, హెవీ గూడ్స్ వెహికిల్స్ కు యథావిధిగా అనుమతి ఉంటుందన్నారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సిన కార్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణ టిక్కెట్లు చూపిస్తేనే పర్మిషన్ ఇస్తామన్నారు.
ఫ్లైఓవర్‌లు క్లోజ్
నాగోల్ ఫ్లై ఓవర్, కామినేని ఫ్లై ఓవర్, ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవర్ ఫ్లై ఓవర్, బైరామల్ గూడ ఎక్స్ రోడ్, ఎల్బీనగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్ పాస్ లోని ఫస్ట్, సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లపై మోటార్, టూ వీలర్, ప్యాసింజర్ వెహికిల్స్ కు అనుమతి ఉండదని రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలకు అనుగుణంగా ప్రయాణికులు ప్లాన్స్ చేసుకోవాలని చెప్పారు.
మద్యం దుకాణాలపై ఆంక్షలు
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలపైనా అధికారులు చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 31న దాదాపు రూ.1000 కోట్ల లిక్కర్ సేల్ జరిగే ఛాన్స్ ఉందని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, రెస్టారెంట్స్‌ను అర్థరాత్రి 1గంట వరకు తెరిచి ఉంచవచ్చునని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్‌ను రాత్రి 1గంటలకు పరిమితం చేసింది. అదే సమయంలో డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా, తమ దగ్గర ఉంచుకున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవెంట్స్, పార్టీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది.