ఫల్గుణ అమావాస్య రోజున మౌనం, ధ్యానం, స్నానం పాటిస్తే కలిగే ఫలితాలివే!
ఫల్గుణ మాసంలో వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఈరోజున పవిత్ర నదీస్నానం ఆచరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. పితృతర్ఫణలు చేస్తారు.
హిందూ పంచాంగం ప్రకారం ఇది సంవత్సరంలో చివరి నెల. అందుకే ఈ నెలలో పఠించే మంత్రాలు, జపాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంవత్సరం ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 20న వస్తోంది. ఈరోజున కొంత మంది ఉపవాసం కూడా ఉంటారు. ఇది మోక్షసాధనకు, జీవితంలో వృద్ధికి దోహదం చేస్తుందని నమ్మకం. ఈరోజున ప్రత్యేకంగా శివపూజ చేసుకుంటారు. అపమృత్యు భయ నివారణకు, రోగ విముక్తికి ఈరోజున ప్రత్యేక పూజలు చేసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందనే నమ్మకం. ఈ రోజు చేసే ఉపవాసాన్ని అశ్వత ప్రదక్షిణ వ్రతం అంటారు. ఈ రోజు రావి చెట్టుకు కూడా పూలు చేసుకుంటారు. శని పూజ కూడా ఆచరిస్తారు.
ఫల్గుణ అమావాస్య తిథి, యోగం
ఫిబ్రవరి 19, ఆదివారం సాయంత్రం 04.18 గంటల నుంచి ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12.35 గంటల వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. ఫిబ్రవరి 20 సోమవారం అవుతున్నందున దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు.
ఫిబ్రవరి 20న ఉదయం నుంచే పరిఘ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత శివ యోగం మొదలవుతుంది. పరిఘ యోగంలో శని గ్రహం పాలించే యోగం కాబట్టి వని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ యోగంలో శత్రు జయానికి అవకాశాలు ఎక్కువ. శత్రుత్వం నశించేందుకు చేసే ఏకార్యం తలపెట్టిన విజయం ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని ప్రతీతి. పరిఘయోగంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు. ఏ పని తలపెట్టినా పరిఘ యోగం గతించి శివయోగం మొదలయిన తర్వాతే చెయ్యాలి.
ఫల్గుణ అమావాస్య ప్రశాస్త్యం
అమావాస్య తిథి నాడు శ్రీమహా విష్ణు ఆరాధన చెయ్యడం, భాగవత పారాయణ చాలా మంచిదని నమ్మకం. ఈ రోజున చేసే దానధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. ఈరోజున చేసే పూజ, ఉపవాసం కుటుంబం, సంతాన ఆనందం, అభివృద్దికి దోహదం చేస్తాయి. జాతకంలో పితృదోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం చేసి దోష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు.
రావి చెట్టు పూజ
ఫాల్గుణ అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం వల్ల సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిసత్రు. చెట్టు మొదట్లో నీళ్లు, పాలు సమర్పించి పుష్పాలు, అక్షతలు, చందనం సమర్పించి పూజించాలి, రావి చెట్టు చుట్టూ దారం కడుతూ 108 ప్రదక్షిణలు చెయ్యాలి. చెట్టు కింద దీపం వెలిగించాలి. తర్వాత శక్త్యానుసారం దాన ధర్మాలు చేసుకోవచ్చు. ఈనియమాలను అనుసరించడం వల్ల పితృదోషాలు, గృహదోషాలు, శని దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
నదీస్నానం, దాన, ధర్మాలు
ఫల్గుణ అమావాస్య నాడు చేసే స్నానం, దానాలు, పుణ్య కార్యాలకు ప్రత్యేక మహాత్మ్యం ఉంటుంది. ఈరోజున ఆచరించే మౌన వ్రతం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్నానం, మౌనం, ధ్యానం ఈరోజున చేసిన వారికి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం లభిస్తుందని దేవర్షి వ్యాసుడు వివరించారు. ఫల్గుణ అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానానికి వెళ్తారు. ఇలా ఈ రోజున నదీస్నానం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ ఏడాది ఫల్గుణ అమావాస్య సోమవతి అమావాస్య కూడా కావడం మూలంగా ఈ రోజు ఉపవాసంచ చేసేవారు సోమవతి అమావాస్య కథ కూడా వినాలి. భీష్మూడు యుధిష్టిరునికి ఈ రోజు ప్రాశస్త్యాన్ని వివరించాడు. ఈరోజున పవిత్ర నదీ స్నానం చేసిన వారికి అన్ని దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుందని భీష్ముడు వివరించాడు. నదీ స్నానం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని, వారి ఆశీస్సులు దొరుకుతాయని నమ్మకం.
Also Read: శివుడి శరీరభాగాలు పడిన ఐదు క్షేత్రాలివి, ఒక్కటి దర్శించుకున్నా అదృష్టమే!