Sri Rajarajeswari: దసరా రోజు రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం - సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి!
10 Day Of Dussehra 2024 : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి రోజైన విజయ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది కనకదుర్గమ్మ....
Durgamma as Sri Raja Rajeshwari : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన దసరా రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాన్ని ఇచ్చినందుకు గుర్తుగా విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది
భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరీదేవి .. మహాత్రిపుర సుందరిగా పూజలందుకుంటోంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహించే రాజరాజేశ్వరీదేవి..శ్రీ చక్రానికి అధిష్టాన దేవత. ఈ అవతారంలో అమ్మవారి చేతిలో చెరుకుగడ, అభయముద్రతో అనుగ్రహిస్తుంది. ప్రశాంతమైన చిరునవ్వు, చల్లనిచూపు..భక్తులకు వరాలిస్తున్నట్టు ఉంటుంది.
చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయాన్నివ్వాలని ప్రార్థించాలి. సౌభాగ్యం కోసం వివాహితులు కుంకుమపూజ చేస్తారు. ఈ రోజు ఆలయంలో అయినా ఇంట్లో అయినా లలితా సహస్రనామ పారాయణం చేయడం శుభకరం.
Also Read: మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
దసరా రోజు అమ్మవారి ధ్యానంలో భాగంగా ఈ అష్టకం చదువుకోండి...
శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం (Sri Rajarajeswari Ashtakam)
అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రిణయనీ కాత్యాయనీభైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ
వాణీ వల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ విరాజితా
వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా శూలధను: కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రామాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యాపంచ ప్రణవాది రేఫ జననీ యాచిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
అంబాపాలిత భక్తి రాజి రనిశం అంబాష్టకం యఃపఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
Also Read: రావణుడు మంచివాడా చెడ్డవాడా - రావణ దహన వేడుకల వెనుకున్న సందేశం ఏంటి!
దేవీ త్రిరాత్ర వ్రతం ఆచరించేవారికి విజయ దశమితో వ్రతం పూర్తవుతుంది. అక్టోబరు 10 గురువారం దుర్గాష్టమి వచ్చింది. అక్టోబరు 11 శుక్రవారం ఉదయం 6 గంటల 44 నిముషాల వరకూ అష్టమి ఉన్నా ఆ తర్వాత రోజుమొత్తం నవమి ఘడియలున్నాయి. అక్టోబరు 12 శనివారం సూర్యోదయ సమయానికి దశమి ఘడయలున్నా..రోజంతా దశమి ఉంది. అందుకే విజయ దశమి వేడుకలు అక్టోబరు 12 శనివారం జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టు పూజ చేస్తారు.
Also Read: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!