Dakshinayanam 2023: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!
జూలై 17 నుంచి దక్షిణాయణం ప్రారంభమవుతోంది. ఉత్తరాయణంలో దైవకార్యాలు నిర్వహిస్తే దక్షిణాయంలో పితృకార్యాలు నిర్వహించాలని, తర్పణాలు విడవాలని చెబుతారు. ఇంకా దక్షిణాయనం ప్రత్యేకత ఏంటంటే...
![Dakshinayanam 2023: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే! Dakshinayana Punyakalam 2023 importance and significance of Dakshinayanam, started from july 17th to 2024 january 14th, know in telugu Dakshinayanam 2023: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/5962465cdb06c9628746fffcbd9f82c01689010602196217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dakshinayana Punyakalam 2023: సూర్య గమనం ఆధారంగా కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. అంటే ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. ఏటా జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం ఉంటుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ... కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పుకుంటాం కానీ సరిగ్గా గమనిస్తే సూర్యోదయం తూర్పు దిక్కున జరగదు. కేవలం ఏడాదిలో రెండురోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అవి మార్చి 21 , సెప్టెంబరు 23. మిగిలిన ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు.
Also Read: కామాక్షీ దీపం విశిష్టత ఏంటి - ఈ దీపం ఏ సందర్భాల్లో వెలిగిస్తారు!
దేవతలకు ఉత్తరాయణం పగలు-దక్షిణాయం చీకటి
ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. అందుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు, పూజలు చేస్తారు. అందుకే దక్షిణాయనం ఉపవాసకాలం అంటారు. ఈ సమయంలోనే యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షచేపడతారు. ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు శ్రీ మహావిష్ణువు.
దక్షిణాయంలో సూర్యకాంతి తక్కువ ప్రసరిస్తుంది
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.
Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!
దక్షిణాయనంలో భూమిపైకి పితృదేవతలు
దక్షిణాయనంలోనే పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి . కన్నవారి రుణం తీర్చుకోవడానికి అది మార్గం మాత్రమే కాదు...కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)