Christmas Secrets: యేసు క్రీస్తు పుట్టుక వెనుక దాగున్న 5 బైబిల్ రహస్యాలు.. క్రీస్తు పుట్టుక ఎలా జరిగింది?
డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టుకను క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, యేసుక్రీస్తు పుట్టుక విషయంలో దాగి ఉన్న ఐదు రహస్యాలను ఈ నెలలో ప్రపంచ క్రైస్తవులు మననం చేసుకుంటారు.

డిసెంబర్ నెల వస్తే చాలు, ప్రపంచంలోని క్రైస్తవులు అంతా సంబరాలు జరుపుకుంటారు. డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టుకను క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే, యేసుక్రీస్తు పుట్టుక విషయంలో దాగి ఉన్న ఐదు రహస్యాలను ఈ నెలలో ప్రపంచ క్రైస్తవులు మననం చేసుకుంటారు. ఇవన్నీ వారి మత గ్రంథమైన బైబిల్‌లో పొందుపరచడం జరిగింది.
యేసు క్రీస్తును దేవుడిగా ఆరాధించే క్రైస్తవులు చెప్పే విషయాలు ఏంటంటే... యేసు క్రీస్తు పుట్టుక యాదృచ్ఛికంగా జరిగిందని కాదు, శతాబ్దాల క్రితమే ఆయన భూమి మీద జన్మిస్తాడని వారి మత గ్రంథంలోని ప్రవక్తలు చెప్పినట్లు చెబుతారు. ఆయన జననానికి ముందే ప్రవక్తలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినట్లు చెప్తారు. వారు యేసు క్రీస్తు పుట్టుకకు సంబంధించి చెప్పిన ముఖ్యమైన ఐదు అంశాలను మనం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
1. కన్యకు జన్మించడం (Born of a Virgin)
యేసు క్రీస్తు పుట్టుక ఓ అద్భుతమని క్రైస్తవుల మత గ్రంథం బైబిల్ చెబుతోంది. మానవ ప్రమేయం లేకుండా కన్యక గర్భంలో జన్మిస్తాడని ముందే ప్రవక్తలు ప్రకటించినట్లు బైబిల్ పండితులు చెబుతారు. “కన్యక గర్భవతియై కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును” అని యెషయా (Isaiah) అనే ప్రవక్త యేసు క్రీస్తు పుట్టుకకు ముందే (700 సంవత్సరాల ముందు) ఈ విషయాన్ని చెప్పినట్లు బైబిల్ స్కాలర్స్ చెబుతారు. ఇందుకు సరిపోలే బైబిల్ గ్రంథంలోని యెషయా 7:14లో ఈ విషయం ప్రవక్త రాసినట్లు చెబుతారు. ఇది రాసిన 700 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు మేరీ అనే కన్యకకు జన్మించినట్లు చెప్తారు. ఇది యేసు క్రీస్తు పుట్టుక రహస్యంగా చెప్పవచ్చు.
2. జన్మస్థలంగా బేత్లెహేము (Place of Birth: Bethlehem)
యేసు క్రీస్తు పుట్టుకలోని మరో రహస్యం ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తారన్న విషయం. ఆయన ఇజ్రాయెల్‌లోని ప్రధాన పట్టణంలో కాకుండా ఓ చిన్న ఊరిలో జన్మిస్తారని ప్రవక్తలు చెప్పారు. మీకా అనే ప్రవక్త క్రీస్తు పూర్వమే 8వ శతాబ్దంలో చెప్పిన మాట: “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వేలకొలది కుటుంబములలో నీవు స్వల్పమైనదానవైనను, నా నిమిత్తము ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; అతని పుట్టుక పూర్వకాలమునుండి, యుగయుగములనుండి యున్నది” అని ప్రవక్త చెప్పినట్లు బైబిల్ పండితులు చెప్తారు. మికా అనే ప్రవక్త చెప్పినట్లే యేసు క్రీస్తు బేత్లెహేము అనే ఊరిలో జన్మించారు.
3. దావీదు వంశంలో పుట్టడం (Descendant of David)
యేసు క్రీస్తు ఏ వంశంలో పుడతారన్న విషయం మరో రహస్యంగా క్రైస్తవ పండితులు చెప్తారు. యేసు క్రీస్తు, ఇశ్రాయేలు రాజ్య స్థాపకుడు అయిన దావీదు వంశం నుండి వస్తాడని యిర్మీయా అనే ప్రవక్త చెప్పినట్లు చెబుతారు. “నేను దావీదునకు నీతి చిగురును పుట్టించు దినములు వచ్చుచున్నవి; ఆయన రాజై ఏలును” అని బైబిల్‌లో రాయబడిన యిర్మీయా 23:5 (Jeremiah 23:5) వాక్యము యేసు క్రీస్తు పుట్టిన తర్వాత నెరవేరినట్లు చెప్తారు. ఇది క్రీస్తు పూర్వం క్రీ.పూ. 626 – 586 మధ్య చెప్పినట్లు బైబిల్ పండితుల అభిప్రాయం.
4. బేత్లెహేము శిశువుల వధ (Massacre of the Innocents)
యేసు క్రీస్తు పుట్టినప్పుడు బేత్లెహేము అనే ఊరు హేరోదు రాజు పాలనలో ఉండేది. ఆ సమయంలో కొద్ది మంది జ్ఞానులు "యూదులకు కొత్త రాజు పుట్టాడు, ఎక్కడ?" అని నాటి రాజైన హేరోదును అడగడం జరుగుతుంది. దీంతో హేరోదు రాజు ఆగ్రహంతో బేత్లెహేము అనే ఊరిలో ఉన్న చిన్న పిల్లలు, అందులో మగ పిల్లలను సామూహికంగా చంపడం జరుగుతుంది. ఈ వృత్తాంతం అంతా బైబిల్‌లోని మత్తయి అనే గాస్పల్‌లో చెప్పడం జరుగుతుంది. అయితే, ఇలా జరుగుతుందని ముందుగానే యిర్మియా (Jeremiah) అనే ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలోనే రాయడం జరిగిందని బైబిల్ పండితులు చెప్తారు. ఇందుకు ఆధారమైన బైబిల్ వాక్యం: “రామాలో ఒక స్వరము వినబడెను, ఏడ్పును గొప్ప దుఃఖమును కలిగెను; రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది” అని సూచనగా ముందే చెప్పారని బైబిల్ పండితుల వ్యాఖ్యానం.
5. ఐగుప్తుకు వెళ్లడం ఆ తర్వాత తిరిగి రావడం (Flight to Egypt and Return)
హేరోదు చిన్న పిల్లలను సామూహికంగా హత్య చేస్తున్న సమయంలో యేసు క్రీస్తును ఐగుప్తుకు తీసుకెళ్లమని దేవదూత ఆయన తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. ఈ వృత్తాంతం మత్తయి అనే యేసు క్రీస్తు శిష్యుడు తన గాస్పల్‌లో వివరిస్తారు. ఇలా జరుగుతుందని యేసు క్రీస్తు పుట్టుక ముందే హోషేయ అనే ప్రవక్త క్రీస్తు పూర్వం 750 నుండి 722 సంవత్సరాల మధ్య ప్రవచించారని బైబిల్ పండితులు చెప్తారు. ఇందుకు ఆధారంగా హోషేయ 11:1 (Hosea 11:1)లో రాసినట్లు “ఇశ్రాయేలు బాలుడుగా ఉన్నప్పుడు నేను అతనిని ప్రేమించితిని; నా కుమారుని ఐగుప్తులోనుండి పిలిచితిని” అన్న వాక్యాన్ని చెప్తారు.
ఇలా యేసు క్రీస్తు పుట్టుక సందర్భంగా జరిగిన అంశాలు, ఆయన కన్నా ముందే చాలా వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు ముందుగానే రాశారని బైబిల్ పండితులు, క్రైస్తవుల విశ్వాసం. ఇవే కాకుండా యేసు క్రీస్తు జీవితం, సిలువ మరణం, తిరిగి లేవడం వంటి సంఘటనలు కూడా ముందుగానే చెప్పబడినట్లు విశ్వసిస్తారు. అందుకు బైబిల్‌లో ఉన్న వాక్యాలను ఆధారాలుగా చెప్తారు.





















