Dussehra 2025: అశోక విజయదశమి: బౌద్ధులు దసరాను ఎందుకు ప్రత్యేకంగా జరుపుకుంటారు? అంబేద్కర్, అశోకుని అనుబంధం ఏమిటి?
Dussehra 2025: అశోకుడు యుద్ధం విడనాడి, ధమ్మ మార్గాన్ని స్వీకరించారు. హిందూ ధర్మంలో విజయదశమి శక్తి విజయానికి సూచన, బౌద్ధులకు ఇది అశోక విజయదశమి. ధర్మ విజయానికి దసరా సూచికగా భావిస్తారు.

Dussehra 2025: హిందువులు దసరా పండుగను జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, బౌద్ధులు కూడా ఈ పండుగను అశోక విజయదశమిగా జరుపుకుంటారని మీకు తెలుసా? హిందువులు దసరాను దుర్గాదేవి లేదా శ్రీరాముడి విజయంగా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అయితే, బౌద్ధులు దీనిని ధమ్మ చక్రవర్తి పరివర్తన దినంగా పాటిస్తారు. దీనిని వారు ధార్మిక విజయంగా పేర్కొంటూ, విజయదశమి రోజున ప్రత్యేకమైన సామాజిక ఉత్సవంగా నిర్వహిస్తారు.
అశోక విజయదశమి లేదా ధమ్మ చక్రవర్తి పరివర్తన దినం అంటే ఏంటి?
దసరా పండుగను అశోక విజయదశమిగా జరుపుకోవడానికి ప్రధాన కారణం మౌర్య చక్రవర్తి అశోకుడు. క్రీ.పూ. 268 నుంచి 232 వరకు జీవించిన అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి పాలకుడు. ఆయన పాలనలో 8వ సంవత్సరంలో, క్రీ.పూ. 261లో కళింగ యుద్ధం (నేటి ఒడిశా ప్రాంతం) జరిగింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు, సాధారణ ప్రజలు చనిపోయారు, మరెందరో గాయపడ్డారు. ఈ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రక్తపాతంతో కూడిన హృదయవిదారక దృశ్యాలు, ప్రజల విలాపాలు చూసి అశోకుడు తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఈ దృశ్యాలు అతని హృదయాన్ని మార్చివేశాయి. ఈ సైనిక విజయం ప్రయోజనం లేని హింసాత్మక చర్యగా ఆయన భావించారు.
ధమ్మ విజయం గా దసరా పండుగ
ఈ పశ్చాత్తాపం కారణంగా చక్రవర్తి అశోకుడు యుద్ధం అనే హింసాత్మక చర్యలను విడనాడి, శాంతి, అహింస, కరుణ అనే ధమ్మం మార్గాన్ని స్వీకరించారు. హిందూ ధర్మంలో విజయదశమి శక్తి విజయానికి సూచనగా ఉన్నట్లే, బౌద్ధులు అశోక విజయదశమిని ధర్మ విజయానికి సూచికగా భావిస్తారు. అంటే, అశోకుడు యుద్ధం ద్వారా సామ్రాజ్య విస్తరణను విడిచిపెట్టి, ధమ్మం (ధార్మిక పాలనా నీతి) ద్వారా ప్రజల హృదయాలను గెలిచే పద్ధతిని అనుసరించారు. దీనినే బౌద్ధులు ధమ్మ విజయంగా చెబుతారు. విజయదశమికి ఎందుకు ముడిపెడతారు: చారిత్రక ఆధారాల ప్రకారం అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించింది ఏ రోజు అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ ముఖ్యమైన పరివర్తన విజయదశమి రోజునే జరిగిందని కొందరు నమ్ముతారు, అందుకే దీనిని ఈ పండుగతో ముడిపెట్టడం జరిగింది.
అశోక విజయదశమి ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
బౌద్ధులు ఈ పండుగను నిర్వహించడం 1956 అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇదే రోజున, డా. బి. ఆర్. అంబేద్కర్ సుమారు ఐదు లక్షల మంది అనుచరులతో నాగ్‌పూర్‌లోని దీక్షాభూమి వద్ద హిందూ ధర్మాన్ని విడిచి బౌద్ధాన్ని స్వీకరించారు. నాటి భారత సమాజంలో ఉన్న కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అన్యాయాలను రూపుమాపేందుకు ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంచుకున్నారు. అన్యాయంపై సమానత్వం, జ్ఞానం, ధర్మం విజయం సాధించిన రోజుగా దీనిని వారు భావించారు. ప్రతి సంవత్సరం దీక్షాభూమి వద్ద బౌద్ధులు తెల్లటి వస్త్రాలు ధరించి సమావేశమవుతారు. బుద్ధుడి పంచశీల సూత్రాలు, అంబేద్కర్ రచించిన 22 ప్రతిజ్ఞలు పఠిస్తారు. ఈ వేడుకను బౌద్ధం పునరుజ్జీవనానికి ప్రతీకగా భావిస్తారు. విజయదశమి రోజునే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించారన్న బలమైన నమ్మకం డా. బి. ఆర్. అంబేద్కర్ కు ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు. అందువల్లనే, ఆయన సామాజిక ఉద్యమం కోసం ఈ పవిత్రమైన రోజును ఎంచుకున్నారు.
ప్రపంచ బౌద్ధులంతా అశోక విజయదశమిని జరుపుతారా?
ప్రపంచ బౌద్ధులంతా విజయదశమిని అశోక విజయదశమిగా జరుపుకోరు. శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్, చైనా వంటి దేశాల్లో ఉన్న బౌద్ధులు ఈ విజయదశమిని ప్రత్యేక రోజుగా గుర్తించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు. వారికి అశోకుడి ధమ్మ పరివర్తన దినంతోనూ, అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన రోజుతోనూ సంబంధం లేదు. వీరు కేవలం బుద్ధుడి జీవితంతో ముడిపడిన ముఖ్య సంఘటనలకు సంబంధించిన రోజులకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే, విజయదశమిని అశోక విజయదశమిగా ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుపుకునేవారు నవయాన బౌద్ధులు మాత్రమే. బౌద్ధంలో మహాయానం, హీనయానం అనే రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. అయితే, ఈ నవయాన బౌద్ధం అనే శాఖకు రూపశిల్పి డా. బి. ఆర్. అంబేద్కర్. బౌద్ధాన్ని తన సామాజిక కోణం నుంచి విశ్లేషించిన అంబేద్కర్, తన అనుచరులతో ఈ శాఖకు అంకురార్పణ చేశారు. మౌర్య చక్రవర్తి అశోకుడు, రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ ఇద్దరూ విజయదశమి రోజునే బౌద్ధాన్ని స్వీకరించారన్న నమ్మకంతో, ఈ నవయాన శాఖ బౌద్ధులు విజయదశమిని తమ కోణంలో అశోక విజయదశమిగా జరుపుకుంటారు.






















