Arunachalam Giri Pradakshina: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
Topi Amma : అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరిప్రదక్షిణ చేస్తుంటుంది ఆమె. భక్తులంతా పోటీపడి కానుకలిస్తుంటారు కానీ విసిరిపడేస్తుంటుంది..ఇంతకీ ఎవరామె..భక్తులకు ఆమెను చూస్తే ఎందుకంత పూనకం..
Arunachalam Giri Pradakshina Topi Amma: అరుణాచలేశ్వరు సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. పౌర్ణమి రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది. అయితే అక్కడకు వెళ్లే భక్తులంతా ఓ మహిళ గురించి మాట్లాడుకుంటారు. అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే ఆమె అసలు పేరేంటో తెలియదు కానీ భక్తులు మాత్రం టోపీ అమ్మ అని పిలుచుకుంటారు..
ఒంటిపై మాసిన దుస్తులు, అప్పుడప్పుడు ఏదో తింటూ తాగుతూ, ఓ చోట సేదతీరుతూ...అరుణాచల వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఆమెను అందరూ అవధూతగా భావిస్తారు. ఆమెను చూసేందుకు, ముట్టుకునేందుకు, మాట్లాడేందుకు ఎగబడుతుంటారు. మతిస్థిమితం లేనట్టుగా కనిపించే టోపీ అమ్మ...ఈ ప్రపంచంలో సంబంధం లేదన్నట్టుగా తనపని తాను చేసుకుపోతుంది. ఇచ్చిన వస్తువులు విసిరి పడేస్తుంటుంది కానీ ఆమె నీడ పడడమే మహాభాగ్యంగా భావిస్తుంటారు భక్తులు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ప్రతి రోజూ సాయంత్రం యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది...అక్కడ ఆమెను దర్శించుకునేందుకు బారులుతీరుతుంటారు. కానీ టోపీఅమ్మకు అవేం పెద్దగా పట్టవు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఆమె అనుగ్రహం పొందగానే అనారోగ్య సమస్య తీరిపోయిందని అప్పటి నుంచి ఆమెను దైవంగా భావించడం మొదలుపెట్టారనే ప్రచారం ఉంది. రోజూ గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఇప్పటివరకూ 11 వేలసార్లు గిరిప్రదక్షిణ చేసిందని చెబుతారు..అందుకే ఆమె అనుగ్రహం కోసం పోటీపడతారు.
ఇదంతా బాగానే ఉంది...కానీ...భక్తి పేరుతో ఆమెను భక్తులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? ఎన్ని పుకార్లు ప్రచారం చేస్తున్నారో తెలుసా?
టోపీ అమ్మ తాగిపడేసిన నీళ్లు రాసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి
ఆమె వాడిపడేసిన దుస్తులు వేసుకుంటే మంచి జరుగుతుంది..
తాగిపారేసిన టీ కప్పులో మిగిలిన టీ తాగితే మేలు జరుగుతుంది
ఆమెకు ఆహారం, డబ్బు ఇచ్చినప్పుడు ఆమె తీసుకుంటే అపార సంపదలు వస్తాయి
ఆమెను ముట్టుకుంటే కష్టాలు తీరిపోతాయి, ఆమెకు చెప్పులిస్తే గ్రహబాధలు పోతాయి
ఇవన్నీ ప్రచారాలు మాత్రమే..నిజం కాదు..ఈ వాస్తవం తెలియక అంతా ఎగబడుతున్నారు. ఆమెను ముట్టుకోవాలి, డబ్బులివ్వాలని ఆమెను ఇబ్బందిపెడుతున్నారు. ఆమె మహిమలు చూపిస్తుందని నమ్ముతారు. రమణ మహర్షి విషయంలోనూ ఇదే జరిగింది. రమణ మహర్షి ఒంటికి తాకిన నీరు తాకితే జబ్బులుపోతాయని..ఆయన స్నానం చేస్తుంటే తూములోంచి వచ్చే నీళ్లు వాటర్ బాటిళ్లలో నింపేవారు. దానిని రమణమహర్షి తీవ్రంగా వ్యతిరేకించారు..ఈ విషయం రమణమహర్షి పుస్తకంలో కూడా ఉంది. ఇప్పుడు టోపీ అమ్మగురించి చేస్తున్న ప్రచారాలు కూడా అబద్ధమే. ఇంకా అరుణాచంలో శేషాచల స్వామి, సాదశివబ్రహ్మేంద్ర స్వామిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వాళ్లంతా అవధూతలు అనే భక్తివిశ్వాసాలు మీకుంటే భక్తితో నమస్కరించుకోండి..వాళ్లు అనుసరించే పద్ధతులు అనుసరించేందుకు ప్రయత్నించండి. కానీ మీదకు ఎగబడడం, ఇబ్బందిపెట్టడం, వెంటపడి పరుగులుతీయడం సరికాదు. నిత్యం ఆమె గిరిప్రదక్షిణ చేస్తుంటుంది.. మీరు కూడా ఆ క్షేత్రంలో ఉన్నన్ని రోజులూ నిత్యం గిరిప్రదక్షిణ చేయండి. ఇక ఆహారం కూడా ఆమెకు కావాల్సినప్పుడు అడిగి తీసుకుంటుంది.. వెంటపడి మరీ బలవంతంగా ఇచ్చేవారున్నారు.
గిరిప్రదక్షిణను టోపీ అమ్మ..ఓ తపస్సుగా భావించి చేస్తోంది. మధ్యలో ఆమెతో మాట్లాడాలని ఎవరైనా ప్రయత్నించినా మాట్లాడదు.. ఆమె నిజంగా మాట్లాడాలి అనుకుంటే పిలిచి మరీ మాట్లాడుతుంది. కష్టాలు కోర్కెలు తీరుతాయి జీవితంలో అద్భుతం జరుగుతుందని భావించి టోపీ అమ్మ లాంటివారిని ఇబ్బంది పెడితే పుణ్యంరాదు కదా పాపం చుట్టుకుంటుంది.
మహాత్ములను, అవధూతలను ఇబ్బందిపెడితే వారు కాకపోయినా ప్రకృతి మీకు హాని కలిగిస్తుందంటారు పండితులు.. అందుకే ఆమెను ఇబ్బందిపెట్టకండి..మీకు నిజంగా ఆమెపై భక్తి ఉంటే దూరం నుంచి నమస్కరించండి.