Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Anurag Kulkarni- Ramya Behara Wedding: తెలుగు సినిమా పరిశ్రమలో గాయకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం (నవంబర్ 15న) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి కొద్ది మంది మిత్రులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో నూతన వధూవరులు మరింత అందంగా కనిపిస్తున్నారు. వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. సంతోషంగా వివాహ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు.
Singers #Anuragkulkarni & #Ramyabehara tied knot.
— Suresh PRO (@SureshPRO_) November 16, 2024
Congratulations to the couple ❤️ pic.twitter.com/dXCe52rlNo
తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్స్‌గా మంచి గుర్తింపు
తెలుగు సినిమా పరిశ్రమలో అనురాగ్, రమ్య గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో పాటలు పాడి ఆడియెన్స్ ను ఎంతగానో అలరించారు. అనురాగ్ కులకర్ణి ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్ నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కొద్ది కాలంలోనే స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘RX100’ మూవీలో ‘పిల్లారా..’ సాంగ్ ఓ బాగా పాపులర్ అయ్యాడు. పలు అవార్డులు రావడంతో పాటు మంచి ప్రశంసలు లభించాయి. అటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో ‘ప్రణవాలయ..’ సాంగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
రమ్య బెహరా సూపర్ సింగర్ 4లో పాల్గొని చక్కటి ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె బోలెడు సినిమాల్లో పాటలు పాడింది. అద్భుతమైన గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులకు అలరించింది. ‘టెంపర్’, ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమకథా చిత్రం’, ‘లౌక్యం’, ‘కొత్తజంట’, ‘చిన్నదాన నీ కోసం’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘ఇస్మార్ట్ శంకర్’,‘రెడ్’, ‘రంగ్ దే’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు మంచి గుర్తింపు తెచ్చాయి.
నిజంగానే పెళ్లి చేసుకున్నారా?
మరో వైపు ఈ ఫోటోలు చూసి చాలా మంది అనురాగ్, రమ్య ఎందుకు అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదంటే... ఎవరైనా మార్ఫింగ్ ఫోటో షేర్ చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అసలు నిజం ఏంటో బయటకు వస్తుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?