Rajya Sabha Elections : ఎమ్మెల్సీ ఎన్నికల సీన్ రాజ్యసభ రిపీట్ కాకుండా వైసీపీ ప్లాన్ - రెబల్స్ పై అనర్హత వేటు!
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఖాళీ అవనున్న మూడు రాజ్యసభ స్థానాలను...తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
Rajya Sabha Elections : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో త్వరలో ఖాళీ అవనున్న మూడు రాజ్యసభ ( Rajyasabha) స్థానాలను...తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ (YSRCP)వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra kumar), బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ (Cm Ramesh)పదవీకాలం ముగియనుంది. సంఖ్యా బలంపరంగా చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది. గతేడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో...టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. బలం లేకపోయినా...ఆమె విజయం సాధించడంతో వైసీపీ లెక్కలు తప్పాయి. కచ్చితంగా గెలుస్తామనుకున్న ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడంతో వైసీపీ షాకయింది.
వ్యూహాత్మక అడుగులు
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. మరోసారి అలాంటివి ఛేదు ఫలితాలు రాకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి...ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తేల్చింది. దీంతో గత దాటిన తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అటు ఇద్దరు ఎమ్మెల్సీలపైనా వైసీపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. వంశీ కృష్ణ యాదవ్,సి. రామచంద్రయ్య...వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో వంశీ కృష్ణ యాదవ్...తెలుగుదేశం పార్టీలో సి. రామచంద్రయ్య చేరిపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిట్టింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలకు టచ్‌లోకి వెళ్లారు.
క్రాస్ ఓటింగ్ లేకుండా చర్యలు
ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా క్రాస్ ఓటింగ్ జరగకుండా అలర్టయింది. మూడేళ్ల క్రితం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు...రాజీనామా లేఖ పంపితే ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల ఫిర్యాదులపైనా స్పీకర్ చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ సభ్యుల బలాన్ని తగ్గిస్తే...రాజ్యసభ ఎన్నికల్లో సులభంగా గెలుపొందవచ్చని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా గంటా రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపైనే త్వరలో వేటు వేసే అవకాశం ఉంది. నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే...తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పడే ఓట్లు తగ్గిపోతాయ్. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పని చేస్తోంది వైసీపీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో.. పక్కన పెట్టిన ఎమ్మెల్యేలంతా అంతా టీడీపీ వైపు వెళ్తే... వైసీపీ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే... టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసీపీ.
స్పీకర్‌కు ఫిర్యాదు
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే...టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లంభనేని వంశీలు...తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.