Kolusu Parthasaradhi: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి - బలహీన వర్గాలకు వైసీపీలో అవమానాలేనని తీవ్ర విమర్శలు
TDP News: పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ - జనసేన తరఫున ఆయన నూజివీడు నుంచి పోటీ చేయనున్నారు.
Kolusu Parthasaradhi Joined in TDP: వైసీపీకి రాజీనామా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (Kolusu Parthasaradhi) సోమవారం టీడీపీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. చంద్రబాబు విజన్ భావి తరాలకు అవసరమని.. వైసీపీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. 'వైసీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. బలహీన వర్గాలకు ఆ పార్టీలో అన్నీ అవమానాలే. ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం. నూజివీడులో అందరితో కలిసి వెళ్తూ టీడీపీ జెండా ఎగురవేస్తాను.' అని పార్థసారథి స్పష్టం చేశారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ తదితరులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని), శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, ఇతర నేతలు ఉన్నారు. కాగా, టీడీపీ - జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలోనే పార్థసారథికి టిక్కెట్ దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
చంద్రబాబును కలిసి బీకే పార్థసారథి
మరోవైపు, పెనుగొండ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ బీకే పార్థసారథి ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును సోమవారం కలిశారు. గత నాలుగేళ్లలో తాను నియోజకవర్గంలో చేసిన పనులను ఆయన చంద్రబాబుకు వివరించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తిని కాదని.. ఎల్లప్పుడూ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగానే పని చేస్తానని తెలిపారు. అయితే, అనంతపురం లోక్ సభ నుంచి పోటీ చేయాలని పార్దసారథికి చంద్రబాబు సూచించారు. ఆ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తావనే రిపోర్టులు తనకు వచ్చాయని బీకేకు చెప్పారు. అధినేత నిర్ణయమే తనకు శిరోధార్యమని బీకే పేర్కొన్నారు. అలాగే, చంద్రబాబును నిమ్మల కిష్టప్ప కూడా కలిశారు. జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, మంగళగిరి జనసేన ఇంఛార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు సైతం చంద్రబాబును కలిశారు. అయితే, ఇది ఆత్మీయ కలయికేనని వారు స్పష్టం చేశారు.
టీడీపీలో చేరనున్న వసంత కృష్ణప్రసాద్
అటు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాను రెండ్రోజుల్లో టీడీపీలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) తెలిపారు. ఐతవరంలో (Ithavaram) సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైలవరం (Mylavaram) నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని.. ఆయన సమక్షంలో టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. టీడీపీ అధిష్టానం సమక్షంలో దేవినేనితో కలిసి అన్నీ మాట్లాడుకుంటామని అన్నారు. 'చంద్రబాబు, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారు. మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. ఆ పార్టీలో ఉండలేక టీడీపీలో చేరుతున్నా. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారు.' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, చాలాకాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై కూడా పరోక్షంగా విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం ఇంఛార్జీగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Also Read: TTD Key Decisions: టీటీడీ ఉద్యోగులకు జీతాలు పెంపు - పాలక మండలి కీలక నిర్ణయాలు