YSRCP : వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ - ఇండియా కూటమి దారిలో మరో అడుగు ముందుకేసినట్లే !
Andhra Pradesh : వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. దీంతో ఆ పార్టీ ఇండియా కూటమి బాటలోనే పయనిస్తోందని క్లారిటీ వచ్చినట్లయింది.
YSRCP followed India Alliance opposing the Waqf Amendment Bill : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా వైసీపీ లోక్ సభలో ప్రకటించింది. ఈ బిల్లుకు ఎన్డీఏ పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఇండియా కూటమి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియా కూటమి పార్టీలన్నీ ఈ బిల్లు వద్దని వ్యతిరేకించిన సమయంలో.. వైసీపీ కూడా వారి బాటలోనే పయనించింది. తము కూడా ఆ బిల్లుకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. మిగతా పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కాబట్టి అలా.. వ్యతిరేకించాయి..కానీ ఇప్పటి వరకూ తాము బీజేపీకి వ్యతిరేకమని.. బీజేపీపై యుద్ధం చేస్తామని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. అంతే కాదు కేంద్రంలో బీజేపీ తీసుకు వచ్చిన ఏ బిల్లుకూ ఇప్పటి వరకూ వైసీపీ వ్యతిరేకంగా ఓటేయలేదు.
ఇండియా కూటమి బాటలో వైసీపీ
వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును సిద్ధం చేశారు. సరైన పత్రాలు లేకపోయినా ఏదైనా స్థలాన్ని తమదేనని వక్ఫ్ బోర్డు ప్రకటించుకునే అధికారాన్ని కూడా తొలగించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఇండీ కూటమి సభ్యులు వ్యతిరేకించారు. వీరి బాటలోనే వైసీపీ నడిచింది.
బీజేపీ పెట్టిన బిల్లులను ఎప్పుడూ వ్యతిరేకించని వైసీపీ
జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతు చట్టాలతో పాటు సీఏఏ, ఎన్నార్సీ బిల్లులకు కూడా వైసీపీ మద్దతు పలికింది. అదే సమయంలో పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన ప్రతి చట్టానికి మద్దతు పలికారు. చివరికి ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని మార్పు చేసే చట్టానికి కూడా మద్దతు పలికారు. ఇటీవల ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక విషయంలో .. అడగకపోయినా వైసీపీ మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఇండియా కూటమి తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ .. జగన్ పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా ఆయన తన విధానాన్ని మార్చుకున్నారు . ఢిల్లీలో జంతర్ మంతర్ ఏపీలో హింసాత్మక పరిస్థితులు ఉన్నాయని ధర్నా చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చాయి. తమ కూటమిలోకి రావాలని జగన్ ను ఆహ్వానించాయి.
ఇండీ కూటమికి దగ్గరగా వైసీపీ
జగన్ కూడా కాంగ్రెస్ కూటమి వైపు జరుగుతున్నారని.. చెబుతున్నారు. కేంద్రంలో టీడీపీ, జనసేన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అయినప్పటికీ తాము బీజేపీకి సపోర్టు చేయడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నామన్న అంచనాకు జగన్ వచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ ఒత్తిడి వల్ల ఇక తమకు ఎంత మాత్రం సహకారం లభిచందని భావించడం వల్ల.. ఇండియా కూటమి వైపు వెళ్తున్నారని అనుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల .. తన పార్టీకి ముప్పుగా మారారని.. ఈ ఉపద్రవాన్ని తగ్గించుకోవడానికీ బీజేపీకి దూరంగా జరగక తప్పడం లేదంటున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించి వైసీపీ తదపురి ఎలాంటి కార్యచరణ ఖరారు చేసుకుంటుందన్న దానిపై ఆసక్తి వ్యక్తమవుతోంది.