YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
Jagan Cadre Loyalty Card: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నిందితులకు, కేసుల్లో చిక్కుకున్న సొంత నేతలకు అండగా నిలవడం యాధృచ్చికం కాదు. దాని వెనుక పక్కా పొలిటికల్ ప్లాన్ ఉంది.

Jagan Political Vendetta Narrative : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న శైలి హాట్ టాపిక్‌గా మారింది. క్రిమినల్ ఆరోపణలు , కేసులు ఎదుర్కొంటున్న స్వపక్ష నాయకులు, నేరుగా బాధితులను పరామర్శించడానికి బదులుగా, నిందితులు లేదా కేసుల్లో చిక్కుకున్న తన సొంత పార్టీ నాయకులకు బహిరంగ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సీదరి అప్పలరాజు, తమ్మినేని సీతారం, ముస్తఫా, విరూపాక్షి అలాగే పలువురు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల సందర్భాలలో జగన్ ప్రదర్శించిన వైఖరి దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఇది రాజకీయ అవగాహన లేక చేస్తున్న పని కాదని, దీని వెనుక అత్యంత పక్కాగా లెక్కించిన పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం.
నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా?
ఈ వ్యూహంలో మొదటి , అత్యంత ప్రధానమైన అంశం క్యాడర్‌కు లాయల్టీ సిగ్నల్ ఇవ్వడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైన చట్టపరమైన, పోలీసు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న తమ పార్టీ కార్యకర్తలకు మీ వెనుక నేనున్నాను అనే కొండంత అభయాన్ని అందించడం ద్వారా పార్టీ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా జగన్ కాపాడుకుంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అధినేతే తమ రక్షణకు నిలబడకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం, గ్రౌండ్ లెవల్ శ్రేణులు ఉత్సాహం కోల్పోతాయి. తప్పు ఒప్పనేది పక్కనబెడితే, నా మనుషుల కోసం నేను ఎంతటి రాజకీయ ఒత్తిడికైనా ఎదురెళ్తాను అనే భావనను క్యాడర్‌లో నూరిపోయడం ద్వారా పార్టీ నిర్మాణం పడిపోకుండా ఆయన వ్యూహాత్మక రక్షణ కవచం నిర్మిస్తున్నారు.
కక్ష సాధింపులుగా ప్రచారం
అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ కక్షసాధింపు అనే కౌంటర్ నరేటివ్‌ను సెట్ చేయడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పార్టీ నేతలను రాజకీయ కక్షసాధింపుతోనే కేసుల్లో ఇరికిస్తున్నారని ప్రచారం చేయడం జగన్ వ్యూహంలో భాగం. ఏ కేసు వచ్చినా, దానిని తీవ్రమైన నేరంగా చూడకుండా పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థల దుర్వినియోగం గా వర్గీకరించడం ద్వారా కేసు తీవ్రతను తగ్గించే యత్నం చేస్తున్నారు. తద్వారా నిందితుడిని నిందితుడిగా కాకుండా రాజకీయ బాధితుడి గా ప్రజల్లో ప్రొజెక్ట్ చేసేందుకు వైఎస్సార్‌సీపీ మీడియా , సోషల్ మీడియా వేదికలను వినియోగిస్తున్నారు.
అదే సమయంలో బిసి, సామాజికవర్గ సమీకరణల రక్షణ కూడా చూస్తున్నారు. సీదరి అప్పలరాజు కేసునే ఉదాహరణగా తీసుకుంటే, ఆయన్ను ఉత్తరాంధ్ర బిసి నేతగా ప్రొజెక్ట్ చేస్తూ ప్రభుత్వం బిసిలపై వేధింపులకు దిగుతోందనే కార్డ్‌ను ప్రయోగించారు. తద్వారా మూల నేరం లేదా కేసులోని అసలు నిజానిజాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి, దానిని సామాజిక వర్గాల పోరుగా లేదా అధికారిక దమనకాండగా మార్చడంలో జగన్ రాజకీయవ్యూహాలు పన్నుతున్నారు. ఇలాగే అంబటి రాంబాబు, విరూపాక్షి వంటి నేతల విషయంలోనూ జరిగింది. ఇటువంటి ఎత్తుగడలు తాత్కాలికంగా కోర్టులు లేదా మీడియా ఇచ్చే సమాధానాలకు అతీతంగా, వారి సొంత ఓటు బ్యాంకులో మా నేతను తొక్కుతున్నారు అనే సెంటిమెంట్‌ను రగిలిస్తాయి.
అయితే, ఈ రాజకీయ లెక్కల్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మైనస్ పాయింట్ న్యూట్రల్ ఓటర్లలో తీవ్రమైన ప్రతికూలత . సామాన్య ప్రజలు, మధ్యతరగతి , విద్యాధికులు న్యాయం వైపు లేదా బాధితుల వైపు నిలబడటాన్ని ఆశిస్తారు. తప్పు చేసిన వారికి, లేదా హిట్ అండ్ రన్ కేసుల్లో రక్షణగా నిలిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పార్టీ అధినేతే స్వయంగా వెళ్ళి అండగా నిలవడం సమాజానికి తప్పు సంకేతాలు పంపుతుందని, నేరస్థులకు రాజకీయం అభయహస్తం ఇస్తోందనే భావన బలపడుతుందని అధికార పార్టీ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ చేస్తున్న ఈ రాజకీయ కసరత్తు అంతా తమ కోర్ ఓటు బ్యాంక్ , క్యాడర్ రీటెన్షన్ కోసమే. న్యూట్రల్ ఓటర్ల ఆగ్రహం కంటే, పార్టీ శ్రేణులు భయపడి పక్కకు తప్పుకోకుండా ఉండటమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీకి అత్యంత కీలకమైన మనుగడ ప్రశ్నగా ఆయన భావిస్తున్నారు. తన మనుషుల కోసం నిలబడే నేతగా గుర్తింపు తెచ్చుకోవాలనే జగన్ మార్క్ హై-స్టేక్స్ పొలిటికల్ గేమ్‌లో ఇది ఒక భాగమే తప్ప, ఆయనకు రాజకీయ జ్ఞానం లేక చేస్తున్న పొరపాటు మాత్రం కాదని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















