Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Mahesh Kumar Goud TPCC Black Magic Claims: బీఆర్ఎస్ నేత హరీష్ రావు శివమొగ్గ మూకాంబికా ఆలయంలో క్షుద్ర పూజలు చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ మండిపడింది.

Telangana Political War Revanth vs Harish Rao: తెలంగాణ రాజకీయాలు క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన క్షుద్ర పూజల వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. హరీష్ రావు మళ్లీ అధికారంలోకి రావడం కోసం క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని, అరుంధతి లోని పశుపతి పాత్ర తరహాలో విచిత్ర శక్తుల కోసం క్రూరమైన పూజలు చేస్తున్నారని మహేష్ గౌడ్ ఘాటు ఆరోపణలు చేశారు. తమ వద్ద ఆధారాలు పక్కాగా ఉన్నాయని, సదరు తేదీలలో హరీష్ రావు ఎక్కడెక్కడ సంచరించారో బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు.
ఈ వివాదంలో ప్రధానంగా కర్ణాటకలోని షిమోగా సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం కేంద్రబిందువుగా మారింది. హరీష్ రావు ఈ పవిత్ర క్షేత్రానికి , పరిసర ప్రాంతాలకు వెళ్లి రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు నిత్యం కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. ప్రజల్లో పార్టీ ప్రాభవం పూర్తిగా కోల్పోవడంతోనే ఇటువంటి నీచమైన దారులను ఎంచుకుంటున్నారని కాంగ్రెస్ నాయకత్వం విమర్శించింది.
కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు అంతే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదిగురు శంకరాచార్యులు నడయాడిన పవిత్రమైన శివమొగ్గ ప్రాంతాన్ని, ముగ్గురమ్మల మూలస్వరూపిణి అయిన మూకాంబికా దేవిని దర్శించుకుంటే దానిని క్షుద్ర పూజలుగా చిత్రీకరించడం హిందూ సంప్రదాయాలను, భక్తుల నమ్మకాలను తీవ్రంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి పవిత్రతను రాజకీయాల్లోకి లాగుతున్న కాంగ్రెస్ నాయకుల నోళ్లు పడిపోవడం ఖాయమని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన రేవంత్ రెడ్డి సర్కార్, తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి నాసిరకం కథనాలను తెరపైకి తెస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, చివరికి తమిళనాడు నాయకుడు విజయ్ వరకు ఎంతోమంది ప్రముఖులు మూకాంబికా ఆలయాన్ని సందర్శిస్తున్నారని.. మరి వారంతా కూడా క్షుద్ర పూజలే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తమ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ప్రాబల్యాన్ని తగ్గించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందంటూ ఎదురుదాడికి దిగారు.
రేవంత్ రెడ్డి గారి చిల్లర రాజకీయం హిందూ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి! @revanth_anumula
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 3, 2026
శృంగేరి పీఠం, కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయం, శీమోగా క్షేత్రం, కాశీ వారాహి అమ్మవారి స్థలాలు, కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు... ఆదిగురు శంకరాచార్యుల వారు… pic.twitter.com/UK8M2RKmk7
పాలనాపరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ప్రధాన పార్టీలు మూఢనమ్మకాలు, సైకలాజికల్ వార్‌ఫేర్‌కు తెరతీయడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ శక్తులను, పుణ్యక్షేత్రాలను రాజకీయ రొచ్చులోకి లాగినందుకుగానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో తెలంగాణలో ఈ క్షుద్ర రాజకీయ యుద్ధం మరిన్ని రోజులు కొనసాగేలా కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















