KNL NEWS: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ ఎమ్మెల్యేలకు మొండిచేయి, ఆగ్రహంగా ఉన్న ఆ సామాజికవర్గం
YSRCP Tickets : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన వైసీపీ, కొత్తవారికి అవకాశం, అధిష్టానం తీరుపై ఎస్సీ వర్గాలు ఆగ్రహం
YSRCP NEWS: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ(YCP) అధిష్టానం ఎడాపెడా అభ్యర్థులను మార్చేస్తుండటంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దశాబ్దాలుగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకున్న నేతలకు సైతం స్థానచలనం తప్పడం లేదు. టిక్కెట్ ఆశిస్తున్న నేతలే గాక...ఆయా నియోజకవర్గాల కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది. అధిష్టానం నిర్ణయంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు(Karnool) జిల్లాలో రెండు నియోజకవర్గాల తో పాటు ఒక ఎంపీ స్థానంలో అభ్యర్థులను మార్చారు. అధిష్టానం నిర్ణయంపై ఆయా నియోజకవర్గాల్లోని ఓ సామాజిక వర్గం కార్యకర్తలు మాత్రం భగ్గుమంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏంటో...అక్కడి పరిస్థితులు ఎంటో ఒకసారి తెలుసుకుందాం...
మార్పులు-మంటలు
గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ(YCP) క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 14 సీట్లను తన ఖాతాలో వేసుకుని రాయలసీమలో తిరుగులేదనిపించింది. అయితే జిల్లాలో ఉన్న రెండు రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులను వైసీపీ(YCP) అధిష్టానం మార్చడంపై ఆ సామాజిక వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోడుమూరు ఎమ్మెల్యేగా జై సుధాకర్ ( Jai Sudhakar), నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్థర్ (Arthur)ను పక్కనపెట్టేసే కొత్తవారికి అవకాశం కల్పించింది. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని కేవలం వెనకబడిన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలనే మార్చడం ఏంటని వారు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కోడుమూరు (Kodumur)ఎమ్మెల్యే గా ఉన్న సుధాకర్ తొలిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించి నియోజకవర్గంలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే వైకాపా నేత హర్షవర్థన్ రెడ్డి తో తలెత్తిన విబేధాల కారణంగానే ఆయన్ను పక్కనే పెట్టేశారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య పలుమార్లు రాజీ కుదిర్చినా ఎవరికి వారే అన్న చందంగా నియోజకవర్గంలో వ్యవహరించారు. మరోసారి సుధాకర్ కు అవకాశం కల్పిస్తే...తాము అండగా ఉండమని హర్షవర్ధన్ రెడ్డి వర్గం హెచ్చరించంతోనే ఆయన స్థానంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు ఆదిమూలపు సతీశ్ ను తీసుకొచ్చారు. దీనిపై సుధాకర్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్థానికేతరుడికి ఏమాత్రం సహకరిస్తారన్నది అనుమానమే.
ఆర్థర్ కు పొగబెట్టారు
ఉమ్మడి కర్నుూలు జిల్లాలో మరో రిజర్వుడు నియోజకవర్గం నందికొట్కూరు.(Nandikotkur) ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు శాప్ ఛైర్మన్ బైరెడ్డి (Byreddy Sidhrtha Reddy) సిద్ధార్థ్ రెడ్డి తో విభేదాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నా...పెత్తనం మొత్తం బైరెడ్డిదే . పెద్దలు పలుమార్లు రాజీ కుదుర్చే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు . ఇవేమీ పట్టించుకోని ఆర్థర్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే కు ఉన్న అధికారాలను పూర్తిగా లాగేశారు. ఐపాక్ నిర్వహించిన సర్వేలో ఆర్థర్ పనితీరు బాగుందని తేలినా..పక్కన పెట్టేశారు. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మద్దతు లేకుండా ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు అంత సులువు కాదు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలిసినా...ఆర్థర్ మాత్రం ఎందుకో అతనితో సఖ్యంగా ఉండలేకపోయారు. దీంతో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుదీర్(Sudheer) ను నియోజకవర్గం కొత్త సమన్వయ కర్తగా నియమించారు. దీనిపై ఆర్థర్ వర్గంతోపాటు అటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది. తాను సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పట్టుబట్టినా...జగన్ కడప నుంచి స్థానికేతర అభ్యర్థిని తీసుకొచ్చి నిలబెట్టారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న రెండు రిజర్వుడు సీట్లలో ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపడమే గాక..స్థానికేతరులను తీసుకొచ్చి ఇక్కడ నిలపడంపై లోకల్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా రిజర్వడ్ సామాజికవర్గం శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త అభ్యర్థులతో ఏమేరకు వారు కలిసి నడుస్తారన్నది తెలియాల్సి ఉంది.