KCR Lands Sale : కేసీఆర్‌కు కలిసి వస్తున్న భూములు - ఎన్నికల పథకాలకు నిధుల సమస్య తీరినట్లేనా ?
కేసీఆర్ నిధుల సమస్య భూముల అమ్మకంతో తీరిపోతుందా ?పథకాల అమలుకు నిధుల కోసం కేసీఆర్ ఇబ్బందులుకేంద్రం నుంచి అనుకున్నంతగా రాని అప్పుల అనుమతులుఆదుకుంటున్న భూముల వేలం
KCR Lands Sale : కోకాపేటలో తెలంగాణ సర్కార్ 43 ఎకరాల భూములను వేలం వేసింది. 3300 కోట్లుకుపైగా ఆదాయం వచ్చింది. ఇలా వేలం వేయడం ఇదే మొదటి సారి కాదు. రెండేళ్ల నుంచి వేలం వేస్తూనే ఉంది. హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంటోంది. జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.
భూముల వేలంతో భారీ ఆదాయానికి కేసీఆర్ ప్లాన్
కోకాపేట నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండించింది. 2021 సంవత్సరంలో నియోపోలీస్ లే ఔట్‌లోని 50 ఎకరాల విస్తీర్ణంలోని 8 ప్లాట్లను హెచ్‌ఎండిఏ వేలం వేయగా సుమారు 2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అప్పట్లో ఎకరం కనీస ధరను హెచ్‌ఎండిఏ రూ.25 కోట్లుగా నిర్ణయించగా బిడ్డర్లు పోటీపడి ఎకరానికి 60.2కోట్లకు కొనుగోలు చేశారు. 2022లో భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 10వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో గుర్తించిన భూములను అమ్మేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ సిద్ధం చేసుకున్నది.
హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మకానికి ఐదు వేల ఎకరాల భూమి !
కోకాపేట, పుప్పాలగూడలో వచ్చిన విధంగా వేల కోట్ల ఆదాయం ఇతర ప్రాంతాల్లో రావడం లేదు. కొ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 5 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో డెవలప్మెంట్ కింద 2,500 ఎకరాలు పూర్తి చేసి దాదాపు రూ.10 వేల కోట్ల పైన ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వెయ్యి ఎకరాల వరకు అసైన్డ్ తదితర భూములు ఉన్నాయి. వీటిని అమ్మి మరో రూ.5 వేల కోట్లు రాబట్టేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర జిల్లాల్లో కూడా అమ్మకానికి అనువైన 13 వేల ఎకరాల భూములను ఆఫీసర్లు గుర్తించారు. తాజాగా 50 ఎకరాలు ఆపైన ఒకే దగ్గర ఉన్న భూములను డెవలప్ చేసి అమ్మాలని నిర్ణయించారు.
ఎన్నికల స్కీములకు నిధుల కొరత తీరినట్లే !
ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి. అందులో మొదటిది నిధులు. అమలు చేయాల్సిన హామీలు లెక్కలేనన్ని ఉన్నాయి. తాజాగా రుణమాఫీని కూడా ప్రకటించారు. భూముల వేలం ద్వారా అత్యధిక మొత్తం వస్తూండటంతో స్కీమ్స్ లకు నిధుల సమస్య పరిష్కారమయినట్లే అనుకోవచ్చు. ఎన్నికల్లోపు కేసీఆర్ నలభై వేల కోట్లు పథకాలకోసం ఖర్చు చేయనున్నారు. రైతుబంధు, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక చేయూతతో పాటు ఇప్పటికే రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్ కిట్, పల్లెలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి వంటి వాటికి కూడా నిధులు విడుదల చేయలనుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే నిధులను విడుదల చేసి, ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.ఇప్పుడు వాటికి నిధులు అందుబాటులోకి వస్తున్నట్లే !