Majlis Politics: మజ్లిస్ దగ్గరకు అన్ని పార్టీలు వెళ్తాయా? అధికార పార్టీలతోనే మజ్లిస్ సన్నిహితంగా ఉంటుందా?
MIM Politics: అక్బరుద్దీన్ ఒవైసీ రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే అనే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. నిజానికి ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గరకు పోయేది మజ్లిస్సే.

MIM Politics Old City: రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరకు రావాల్సిందేనని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ గట్టి స్టేట్ మెంట్ ఇచ్చారు. అందులో ఎంత నిజం ఉందో.. అంత అతిశయోక్తి ఉంది. నిజానికి మజ్లిస్ .. ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉంటుంది. అధికారంలో ఉండే వారు వారితో సన్నిహితంగా ఉండటం వల్ల రాజకీయంగా లాభం ఉంటుందని మజ్లిస్ కు ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటారు. దీని వెనుక పాతబస్తీ వ్యూహం ఉంది. తమ పుట్టలో వేలు పెట్టకుండా అధికారంలో ఉన్న పార్టీలతో దోస్తీ చేసుకుని మజ్లిస్ కోటను కాపాడుకుంటోంది.
పాతబస్తీలోకి వేరే వారాని రానివ్వరు!
మజ్లిస్ పార్టీ పునాదులు పాతబస్తీలో బలంగా ఉండటానికి ప్రధాన కారణం వారు అనుసరించే అధికార పక్షంతో స్నేహం అనే సూత్రం. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సన్నిహితంగా ఉండటం మజ్లిస్ నైజం. దీనివల్ల పాతబస్తీలో తమ పట్టు సడలకుండా చూసుకోవడమే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగం తమకు వ్యతిరేకంగా పని చేయకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇది ఒక రకంగా గివ్ అండ్ టేక్ పాలసీ. అధికార పార్టీకి మైనారిటీ ఓట్ల మద్దతు ఆశ చూపడం, ప్రతిగా తమ కోటలో ఇతరుల ప్రవేశం లేకుండా చూసుకోవడం వీరి ప్రధాన బలం.
గతంలో మజ్లిస్ ఉనికి సవాల్ చేసిన ఎంబీటీ
మజ్లిస్ గుత్తాధిపత్యానికి గండి కొట్టిన సందర్భాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్‌కు చెక్ పెట్టడానికి అమానుల్లాఖాన్ నేతృత్వంలోని ఎంబీటీ ని ప్రోత్సహించారు. ఆ సమయంలో పాతబస్తీలో మజ్లిస్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఒకానొక దశలో మజ్లిస్ ఉనికికే ముప్పు వాటిల్లేలా ఎంబీటీ పుంజుకుంది. అయితే, 2004లో చంద్రబాబు అధికారం కోల్పోవడం, అమానుల్లాఖాన్ మరణం మజ్లిస్‌కు వరంగా మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మజ్లిస్ పార్టీకి తిరుగులేని ప్రాధాన్యత లభించింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడంతో పాటు, పాతబస్తీ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా చూసుకోవడంలో మజ్లిస్ సఫలమైంది. పాతబస్తీ అంటే మజ్లిస్.. మజ్లిస్ అంటే పాతబస్తీ అనే ముద్ర పడటానికి ఆ కాలమే పునాది వేసింది. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంతోనూ అదే స్థాయి సాన్నిహిత్యాన్ని కొనసాగించడం ద్వారా కేసీఆర్ హయాంలోనూ మజ్లిస్ తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది.
ఇటీవల పుంజుకుంటున్న ఎంబీటీ
ప్రస్తుతం మజ్లిస్ నేతలు విర్రవీగుతున్నప్పటికీ, లోలోన వారికి ఒక భయం అయితే ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఎంబీటీ వంటి పార్టీలకు ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ గట్టిగా మద్దతు ఇస్తే, మజ్లిస్ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా యువతలో మజ్లిస్ వైఖరి పట్ల కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ నాయకత్వం బలోపేతమైతే మజ్లిస్ కోట బీటలు వారడం ఖాయం. కానీ, ప్రస్తుత రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ సమీకరణాల కోసం ఆ సాహసం చేయడం లేదు. అలా చేయకుండా మజ్లిస్ రాజకీయం చేస్తోంది.
మా దగ్గరకు రావాల్సిందే అనే స్టేట్‌మెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం.. ఏ పార్టీకైనా గెలుపు గుర్రంగా మారడానికి అవసరమైన మద్దతును మజ్లిస్ అందిస్తుందనే నమ్మకం కలిగించడం. అయితే, ఇది మజ్లిస్ గొప్పతనం కంటే, అధికారంలో ఉండాలనుకునే పార్టీల బలహీనత అనుకోవచ్చు. ఎప్పుడైతే ఒక ప్రధాన పార్టీ పాతబస్తీలో నేరుగా జెండా పాతాలని నిర్ణయించుకుంటుందో, అప్పుడే మజ్లిస్ అసలు రాజకీయ స్వరూపం, బలం బయటపడతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















