Majlis vs Congress: రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే - అక్బరుద్దీన్ వ్యాఖ్యలు - కాంగ్రెస్ కౌంటర్ ఇదే
Akbaruddin: ఏ ముఖ్యమంత్రి అయినా తమకు వద్దకు రావాల్సిందేనని వారి దగ్గరకు తాము వెళ్లమని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు.

Majlis vs Congress In Karimnagar: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ పాతబస్తీ రాజకీయాలు సరిహద్దులు దాటి కరీంనగర్ వేదికగా వేడెక్కాయి. ఒకప్పుడు 15 నిమిషాల వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అక్బరుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు మున్సిపల్ పోరులో తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రులు తమ గడప తొక్కాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మిత్రులైన కాంగ్రెస్-ఎంఐఎం మధ్య వాదోపవాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ అక్బర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీశాయి.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మేమే గెలిపించామని మజ్లిస్ ప్రకటన
గత నవంబర్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని పోటీకి పెట్టకుండా కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఓవైసీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అక్బర్ అదే విషయాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లో మేం లేకపోతే కాంగ్రెస్ గెలిచేదా రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే కాదని, మున్సిపల్ ఎన్నికల తర్వాత తామే కింగ్ మేకర్లమనే సంకేతాలను పంపే ప్రయత్నంగా కనిపిస్తోంది.
మజ్లిస్ భ్రమల్లో బతుకుతోందన్న శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ, ఎంఐఎం భ్రమల్లో బ్రతుకుతోందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ విజయం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా నమ్మకానికి, కార్యకర్తల కష్టానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. పాతబస్తీకి పరిమితమైన రాజకీయాలను రాష్ట్రవ్యాప్తంగా రుద్దాలని చూడటం తగదని, తామే గెలిపించామనుకోవడం వారి అజ్ఞానమని కౌంటర్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎంఐఎం సాగించిన స్నేహ చరిత్రను గుర్తు చేస్తూ, ఇప్పు మళ్లీ అవే పాత ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల కోసమే కాంగ్రెస్, మజ్లిస్ విమర్శలా ?
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంఐఎం ప్రయత్నిస్తుంటే, సెక్యులర్ ఓట్లు చీలకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేయడం కంటే, ఆ పార్టీ కార్యకర్తల్లో కసిని పెంచేలా ఉన్నాయి. మరోవైపు, ఈ ఇద్దరి గొడవను చూస్తూ బీజేపీ నేత సంజయ్ ఇప్పటికే ఓట్లు పోలరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత గొడవలు, కొత్త సవాళ్ల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం మున్సిపల్ ఓటరు నాడిని ఏ వైపు మళ్లిస్తుందో ఫిబ్రవరి 13 ఫలితాల్లో తేలనుంది.























