Vizianagaram News : అసహనానికి కేరాఫ్‌గా మారిన బొత్స - రాజకీయ సవాళ్లు ఆయనను మార్చేస్తున్నాయా ?
బొత్స సత్యనారాయణ ఇటీవలి కాలంలో ఎందుకంత అసహనానికి గురవుతున్నారు?
Vizianagaram News : మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలి కాలంలో సౌమ్యంగా కనిపించడం లేదు. చాలా అసహనంతో ఉంటున్నారు. కొద్ది రోజులుగా మంత్రి బొత్స విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాకు పెద్ద దిక్కు కావడంతో.. ఆయన విజయనగరం వచ్చారంటే నేతలు క్యూ కడతారు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు అటు ప్రజాప్రతినిధులతోపాటు.. అధికారులూ వెళ్తారు. తమ సమస్యలనూ చెప్పుకొంటారు. ఇదే మాదిరి రెండు రోజుల క్రితం ఎస్.కోటలో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వద్దకు ఓ పంచాయితీ వచ్చింది. ఆ సమయంలో ఆయన అసహనం అంతా బయటపడింది.
పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి అంటున్న బొత్స
ఎస్.కోటలో ఇప్పటికే అక్కడ వైసీపీలో రెండు గ్రూపులున్నాయి. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు` ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుల మధ్య పరిస్థితులు ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లోనూ ఒక వర్గం మీద మరో వర్గం వారు ఫిర్యాదు చేసుకున్న సందర్భాలున్నాయి. ఈ నియోజకవర్గంలో సిట్టింగు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అదునుగా ఎమ్మెల్సీ రఘురాజు అసెంబ్లీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వర్గపోరు తారస్థాయికి చేరింది. తాజాగా ఎస్.కోట నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి బొత్సకు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎదుటే ఓ వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలు సమస్య ఏంటో పూర్తిగా వినకుండానే ఒక్కసారిగా మంత్రి వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీలో ఉంటే ఉండు, పోతే పో.. బాధలు మీకేనా మాకు లేవా?’ అంటూ కోపోద్రిక్తులయ్యారు. అక్కడితో ఆగకుండా.. ‘ఏం తమాషాలు చేస్తున్నావా..?. ఏం మాట్లాడుతున్నావ్.. యూజ్‌లెస్ ఫెలో’ అంటూ తన నోటికి పనిచెప్పారు. ‘అది కాదు సార్.. మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అని అవతలి వ్యక్తి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆయన అస్సలు వినిపించుకోలేదు. ‘అసలేంటి.. నీ బాధ.. బాధలు నీకేనా మాకు ఉండవా..? అడిగేవాళ్లు లేరని తమాషాలు చేస్తున్నావా..? ఉంటే ఉండు.. లేకుంటే పో’ అంటూ ఒక్కసారిగా అనడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఓవైపు నాయకులు, కార్యకర్తలు.. మరోవైపు మీడియా అంతా చిత్రీకరిస్తుండగానే ఆయన చిందులు తొక్కడంతో వారు మనస్థాపంతో వెనుదిరిగారు. మరికొందరు మాత్రం బొత్స ఎందుకు అంత అసహనంలో ఉన్నారో అని చర్చించుకోవడం మొదలు పెట్టారు.
బొత్సలో ఎందుకంత అసహనం ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొత్స సత్యనారాయణ అంటే ఒక బ్రాండ్. సీనియర్ మంత్రి. పీసీసీ అధ్యక్షునిగానూ పని చేశారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి అవుతారని భావించినా.. త్రుటిలో ఆ అవకాశం చేజారిపోయింది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా.. తర్వాత వైసీపీలో చేరి, పూర్వవైభవం సంపాదించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్సకు.. ఆ జిల్లాలో ఆయన మాటే వేదవాక్కు. జిల్లా రాజకీయాల్లో పెద్ద తలకాయ. ఆయనను కాదని ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ నుంచి ఈ పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలోనూ ఆ హవా నడిచింది. కానీ, ఇటీవల పరిస్థితిలో మార్పు వచ్చింది. సొంత పార్టీలోనే ఆయన మాట చెల్లుబాటు కావడం లేదని సమాచారం. ఎమ్మెల్యేలు సైతం బొత్స మాట పక్కనపెడుతున్నారని భోగట్టా.
రాజకీయ జీవితం రిస్క్‌లో పడిందని భావిస్తున్నారా ?
ఇదే సమయంలో సొంత కుటుంబం నుంచే ఆయనకు రాజకీయంగా పోటీ ఏర్పడిరదన్న టాక్ వినిపిస్తోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయాన బొత్స నిర్ణయమే ఫైనల్. ఆయన కుటుంబం నుంచే తక్కువలో తక్కువగా ముగ్గురు, నలుగురు అభ్యర్థులు బరిలో ఉండేవారు. జిల్లా పరిషత్తు ఛైర్మన్ పీఠమూ ఆయన చెప్పేవారికే ఖరారయ్యేది. అయితే, ఇప్పుడు సొంత మేనల్లుడు నుంచే ఆయనకు ముప్పు తప్పేలా లేదన్న ప్రచారం జోరుగా విజయనగరం జిల్లాలో నడుస్తోంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఆయన సీటుకే గ్యారంటీ లేదన్న ప్రచారం ఉంది. అయితే, ఎంపీగానో.. లేకుంటే రాజ్యసభకైనా పంపిస్తానని అధినేత కోరినట్లు వినిపిస్తోంది. ఇప్పటికే తనకు కేటాయించిన విద్యాశాఖపై అసంతృప్తిగా ఉన్న బొత్సకు.. ఈ నిర్ణయం మింగుడుపడటం లేదు. క్యాడర్‌కు కూడా పనులేవీ చేయించలేకపోతున్నా అని ఆయన ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. ఒకవైపు జిల్లాలో సొంత నేతలకు ఏమీ చేయలేని పరిస్థితి.. మరోవైపు ఇంటాబయటా ఒత్తిడితో ఆయన సతమతమవుతున్నారని.. అదే బొత్స అసహనానికి కారణమని జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది