AP Vs Telangana : తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్సకు హఠాత్తుగా కోపం ఎందుకు వచ్చింది ? - డైవర్షన్ చేద్దామనుకున్నారా ?
మంత్రి బొత్స హఠాత్తుగా తెలంగాణను ఎందుకు టార్గెట్ చేశారు ?కావాలనే వివాదం చేద్దామనుకున్నారా ?డైవర్షన్ రాజకయం చేద్దామనుకున్నారా ?ఎందుకు వర్కవుట్ కాలేదు ?
AP Vs Telangana : తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నేతల మధ్య గతంలో ఏదైనా అంశంపై వివాదం ఏర్పడితే మీడియాలో హైలెట్ అయ్యేది. కానీ ఈ సారి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ .. తెలంగాణ విద్యా వ్యవస్థపై దారుణమైన ఆరోపణలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ మంత్రులు గట్టిగానే ఖండించినా హైలెట్ కాలేదు. వ్యూహాత్మకంగా అక్కడ పవన్ కల్యాణ్.. తెలంగాణలో పవర్ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడానికి రెండు పార్టీల నేతలు కలిసి ప్లాన్ చేశారు కానీ.. వర్కవుట్ కాలేదన్న అభిప్రాయం ఈ కారణంగానే ఏర్పడుతోంది.
బీఆర్ఎస్ -వైఎస్ఆర్‌సీపీ మధ్య ఇచ్చిపుచ్చుకునేంత సాన్నిహిత్యం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య ఉంది. ఇటీవలి కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు నేరుగా కలవకపోయినప్పటికీ పరస్పర రాజకీయ ప్రయోజనాల విషయంలో సహకారం బహిరంగంగానే కనిపిస్తోంది. తెలంగాణకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సపోర్ట్ బీఆర్ఎస్ కు ఉంటుంది అనుకుంటున్న సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండు రాష్ట్రాల మధ్య వైరం పెంచేవిగా మారాయి. విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఓ రేంజ్‌లో సాగుతూనే ఉన్నాయి.
విభజన సమస్యల పరిష్కారంపై మాట్లాడని రెండు రాష్ట్రాల మంత్రులు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. వచ్చే ఏడాది జూన్ 2 తో విభజనహామీ చట్టం సమయం కూడా పూర్తికానున్నది. ఈలోగా సమస్యలను పరిష్కరించుకోలేకుంటే ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో బేసిన్లు, భేషజాలు లేవని.. సమస్యలను పరిష్కరించుకుంటామని కేసీఆర్ విజయవాడలో చెప్పారు. కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోకపోగా.. రెండు రాష్ట్రాలు విభజన సమస్యల్ని కేంద్రానికి, కోర్టులకు వదిలేశారు. ఇలా వదిలేయడం వల్ల ఏపీ ఎక్కువగా నష్టపోతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆస్తులు ఎక్కువగా హైదరాబాద్ లో ఉన్నాయి. అధికారంలోకి రాగానే ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించేశారు సీఎం జగన్. కానీ ప్రతిఫలంగా రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా ఇప్పించుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
టాపిక్ డైవర్షన్ కోసమే కొత్తగా విమర్శలా ?
బొత్స సత్యనారాయణ గతంలో ఇలా అనవసరంగా ఎప్పుడూ కల్పించుకుని మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ సమయం , సందర్భం లేకపోయినా పరీక్షల నిర్వహణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే.. ఘాటు కౌంటర్లు.. ఏపీ రాజధాని ప్రస్తావన చేసి మరీ.. తెలంగాణ మంత్రులు ఇచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. డైవర్షన్ రాజకీయాలని ఎక్కువ మంది అనుకోవడంతోనే విషయానికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల నేతలు సందర్భం వచ్చినప్పుడు విమర్శించుకోవడం.. అవసరం అయిపోయాక.. పొగుడుకోవడం కామన్ అన్న అభిప్రాయం రావడంతో ప్రజల్లోకి కూడా సీరియస్‌గా టాపిక్ వెళ్లలేదంటున్నారు.