TDP News: లోకేశ్ పాదయాత్ర త్వరగా ముగించేశారా? ఇచ్చాపురం వరకు ఎందుకు వెళ్లలేదు?
Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 18వ తేదీతో ముగిసింది. మధ్యలోనే లోకేశ్ ఎందుకు పాదయాత్రను ముగించారు ? నడవలేక ఆపేశారా ? అనారోగ్యం సమస్యలు ఉన్నాయా ?
Did Lokesh End His Yuvagalam Padayatra So Early : తెలుగుదేశం పార్టీ ( Telugudesam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) యువగళం (Yuvagalam )పాదయాత్ర (Padayatra) ఈ నెల 18వ తేదీతో ముగిసింది. చరిత్రలో నిలిచిపోయేలా ముగింపు సభ నిర్వహించింది. అయితే మధ్యలోనే లోకేశ్ ఎందుకు పాదయాత్రను ముగించారు ? నడవలేక ఆపేశారా ? అనారోగ్యం సమస్యలు ఉన్నాయా ? లేదంటే పార్టీ శ్రేణులు యాత్రకు ముగింపు పలకాలని ఒత్తిడి తెచ్చాయా అన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తానన్న లోకేశ్ ఎందుకు వెనక్కి తగ్గారు ? తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు పెద్ద టాపిక్. వీటన్నంటికి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
పాదయాత్రకు బ్రేకులు
యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్బంగా కుప్పం నుంచి ఇచ్చాపురం యాత్ర చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నాలుగు వేల కిలోమీటర్లు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అది కూడా నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నది టార్గెట్. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం, నందమూరి తారకరత్న హఠాన్మరణంతో పాదయాత్రకు అక్కడక్కడ అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎక్కువ సమయం, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ కారణంగా పాదయాత్రకు కొంత విరామం వచ్చింది.
గత నెలలోనే పునఃప్రారంభం
చంద్రబాబుకు బెయిల్ రావడంతో తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లాలో యాత్రను ముగించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాలన్నా, ప్రచార వ్యూహాలను రూపొందించాలంటే, కొంత సమయం కావాలి. పాదయాత్ర చేస్తూ ఎన్నికలు ప్రణాళికలు రూపొందించడం, అభ్యర్థులను ఖరారు చేయడం, నేతలతో ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహించడం, ఎన్నికల స్ట్రాటజీ రూపొందించడం, బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయడం కుదిరే పని కాదు. ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వస్తుండటంతో పార్టీ సీనియర్ నేతలు, శ్రేణులతో చర్చించారు లోకేశ్. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా విశాఖలోనే పాదయాత్రను ముగించారు.
97 నియోజకవర్గాల్లో పాదయాత్ర
11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా (Visakhapatnam ) అగనంపూడి వద్ద ఈ నెల 18న సాయత్రం ముగిసింది. యువగళం పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు కంప్లీట్ చేయనున్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేలా పాదయాత్ర చేశారు. జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి, విశాఖలో ముగించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు లోకేశ్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించింది.