YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ తప్పెక్కడ చేసింది ?ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని గుర్తించలేకపోయారా ?దిద్దుబాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
YSRCP Fail : నాలుగేళ్ల పాటు తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న వైఎస్ఆర్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం అదీ కూడా సొంత ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు కోలుకోలేని షాక్ లాంటిదే. దీంతో వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల్లో అంతర్మథనం ప్రారంభమయింది. తప్పు ఎక్కడ జరుగుతోంది ? వ్యూహాలు ఎందుకు ఫెయిలవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ వాతావరణ అధికార పార్టీకి నెగెటివ్‌గా మారే పరిస్థితి ప్రారంభం కావడం మరింత ఆందోళనకరం. అందుకే ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలన్న సూచనలు ఆ పార్టీ నుంచి వస్తున్నాయి.
ఏడు స్థానాల కోసం పకడ్బందీ సన్నాహాలు - చివరికి నిరాశే !
ఏడు స్థానాల్లోనూ గెలుపొందడానికి అవసరమైన బలం ఉందని అధికారికంగా పార్టీలో చేరకపోయినా టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు , ఒక జనసేన ఎమ్మెల్యేతో అన్ని స్థానాలు గెలువవచ్చని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా గత వారం రోజులుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఒక్క ఓటు కూడా చెల్లని ఓటు పడకూడదన్న లక్ష్యంతో ఓటింగ్ ప్రాక్టీస్ చేయించారు. చివరికి ఉగాది పండుగ రోజు సాయంత్రం కల్లా అందరూ క్యాంపులకు చేరుకునే ఏర్పాట్లు చేశారు. అందర్నీ విజయవాడలోని హోటళ్లకు చేర్చి ఉదయమే ఓటింగ్‌కు తీసుకెళ్లారు. ఇంత పకడ్బందీగా చేసినా చివరికి ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొత్తం కృషి వృధా పోయింది.
అసంతృప్త ఎమ్మెల్యేలకు ముందుగానే బుజ్జగింపులు !
వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని భావించిన ఎమ్మెల్యేల గురించి సీఎం జగన్ ముందుగానే ఆరా తీశారు. అలాంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా మాట్లాడారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. కొంత మంది బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా క్లిష్టంగా ఉన్నా బిల్లులు కూడా మంజూరు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే అలాంటి వారెవరూ క్రాస్ ఓటింగ్ చేయలేదని చెబుతున్నారు. జగన్ ప్రత్యేకంగా పిలిచి బుజ్జగించినా క్రాస్ ఓటింగ్ చేయడం ఆ పార్ట క్యాడర్ ను ఇబ్బంది పెడుతోంది. ఇది పార్టీపై గ్రిప్ పోయిందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతుందని ఆందోళన చెందుతున్నారు.
చర్యలు తీసుకోలేని నిస్సహాయత !
వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇదేమీ ఉద్యోగం కాదని రాజకీయమని చెప్పుకొచ్చారు. తప్పు చేశారని తెలిసిన తర్వాత కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేనంత దుర్భర పరిస్థితికి వైసీపీ వెళ్లిపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓట్లు వేశారు. ఆ నలుగురిలో ఇద్దరు బహిరంగంగా పార్టీని ధిక్కరించారు. మరో ఇద్దరు ఎవరనేది తెలుసుకునే ఉంటారు. ఆ నలుగుర్ని సస్పెండ్ చేయడం లేదా.. పార్టీ నుంచి బహిష్కరించడం ఇంకా చెప్పాలంటే అనర్హతా వేటు వేసే అధికారం కూడా వైసీపీ చేతుల్లో ఉంది. ఆ నలుగుర్ని పార్టీ నుంచి బహిష్కరించినా వైసీపీకి పోయేదేమీ ఉండదు. కానీ ఏ చర్యలు తీసుకోలేనంత నిస్సహాయ స్థితికి వెళ్లిపోయామా అని క్యాడర్ అనుకుంటోంది.
ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలంటున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం !
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అధికార పార్టీకి ఇబ్బందికరమే. ప్రజల్లో .. పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి చర్యలు చేపట్టకపోతే ఇబ్బంది అవుతుందని పార్టీ నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.