Telangana districts Politics: జిల్లాల మార్పుచేర్పులతో రాజకీయ చదరంగం - రేవంత్ రెడ్డి రిస్క్ చేస్తున్నారా?
Districts Reorganization: తెలంగాణలో జిల్లాలను పునర్ వ్యవస్థీకరణ చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఇది రాజకీయంగా పెనుసవాల్ గా మారనుంది.

Telangana district politics Revanth plan: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తేనెతుట్టెను కదిలించడం వెనుక ఉన్న రాజకీయ, పరిపాలనాపరమైన వ్యూహాలు ఉన్నాయని అనుకోవచ్చు. అయితే ఇది కత్తిమీద సాము లాంటిదే.
గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన
తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చిన ప్రక్రియలో అనేక అశాస్త్రీయ కోణాలు ఉన్నాయని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాటిని సరిదిద్దేందుకు నడుం బిగించారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సెంటిమెంట్ రాజకీయాలు రాజుకున్నాయి. తమ జిల్లా ఉనికి కోల్పోతుందని లేదా పేరు మారుతుందని భావిస్తున్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. ఈ సున్నితమైన అంశాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా న్యాయపరమైన రక్షణ, ప్రజాభిప్రాయం అనే రెండంచుల వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేయడం ద్వారా, ఈ ప్రక్రియ రాజకీయ ప్రేరేపితం కాదని, పూర్తిగా నిపుణుల సలహా మేరకే జరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయన ఎత్తుగడ.
పరిపాలనా సౌలభ్యం కోసమే మార్పులు
అసలు రేవంత్ రెడ్డి ఈ వివాదాస్పద అంశాన్ని ఎందుకు కదిలిస్తున్నారు అనే ప్రశ్నకు పరిపాలనా సౌలభ్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం 5 నుంచి 10 మండలాలతో ఏర్పాటైన చిన్న జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఇతర మౌలిక వసతుల నిర్వహణ ప్రభుత్వ ఖజానాపై భారంగా మారింది. అలాగే, రెవెన్యూ డివిజన్లు ఒక జిల్లాలో, పోలీస్ పరిధి మరో జిల్లాలో ఉండటం వంటి సాంకేతిక లోపాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని సరిదిద్దడం ద్వారా కనిష్ట ప్రభుత్వం - గరిష్ట పాలన సూత్రాన్ని అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించి, అభివృద్ధి పనులకు నిధులు మళ్లించేందుకు దోహదపడుతుందని రేవంత్ సర్కార్ నమ్ముతోంది.
అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు
వ్యతిరేకతను ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మరో ప్రధాన ఆయుధం అఖిలపక్ష సమావేశం . కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నేరుగా నిర్ణయం తీసుకోకుండా, అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించబోతున్నారు. దీనివల్ల, రేపు ఏదైనా జిల్లా రద్దయినా లేదా విలీనమైనా ఆ నెపాన్ని కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపైకి రాకుండా, అందరి అంగీకారంతో జరిగిందని చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడం ద్వారా స్థానిక సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామనే సంకేతాలను బలంగా పంపాలని ఆయన యోచిస్తున్నారు.
కత్తిమీద సాములా ప్రక్రియ
రాజకీయ కోణంలో చూస్తే.. జిల్లాల విభజన ద్వారా క్షేత్రస్థాయిలో కొత్త సమీకరణాలకు రేవంత్ రెడ్డి బీజం వేస్తున్నారు. గత ప్రభుత్వం తమకు అనుకూలమైన నేతల కోసం జిల్లాల సరిహద్దులు గీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని మార్చడం ద్వారా ప్రతిపక్ష పార్టీల పట్టు ఉన్న ప్రాంతాల్లో రాజకీయంగా పైచేయి సాధించే అవకాశం కూడా ఉంది. అయితే, ఈ ప్రక్రియలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా అది ప్రాంతీయ ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల సెంటిమెంట్‌ను సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే అది రాజకీయంగా ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది.





















