వివేకా హత్యపై కొడాలి కామెంట్స్ ఆంతర్యమేంటీ?
వివేకానంద రెడ్డి హత్య తర్వాత మొదలైన రాజకీయ దుమారం నాలుగేళ్లైనా ఆగడం లేదు. హత్య కేసులో జరిగిన పరిణామాలు, విచారణలో వెలుగు చూస్తున్న అంశాలను అస్త్రాలుగా టీడీపీ, వైసీపీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
వివేకా హత్య జరిగి దాదాపు నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇంకా రాజకీయ దుమారం ఆగలేదు. గత ఎన్నికల్లో దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్న వైసీపీ బాగానే లబ్ధి పొందిందని విశ్లేషకులు చెబుతున్న మాట. తర్వాత మారిన పరిణామాలతో ఆ కేసు ఇప్పుడు అధికార పక్షం వైఎస్‌ఆర్‌సీపీకే ఎదురు తిరుగుతుందన్న విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి దీన్ని తమ అస్త్రంగా మార్చుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకే ఈ అంశంలో చాలా దూకుడుగా వెళ్తోంది.
తమ చేతిలో ఉన్న అస్త్రాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ప్రత్యర్థులకు వైసీపీ అందించేసిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తెలుగుదేశం,వైఎస్‌ఆర్‌సీపీలు పోటాపోటీగా వివేక హత్య కేసును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేరాన్ని ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నారు. ఇరు పార్టీల మధ్య కౌంటర్ ఎన్‌కౌంటర్ సాగుతోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత మొదలైన రాజకీయ దుమారం నాలుగేళ్లైనా ఆగడం లేదు. హత్య కేసులో జరిగిన పరిణామాలు, విచారణలో వెలుగు చూస్తున్న అంశాలను అస్త్రాలుగా తెలుగు దేశం వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో ఎదురు దాడి ఓ రేంజ్‌లో ఉంటోంది. ఈ టైంలోనే కొడాలి నాని చేసిన కామెంట్స్ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి.
వివేకానంద కుటుంబంలో జగన్‌కు వ్యతిరేకంగా పని చేసిన వారే ఎక్కువగా ఉన్నారంటూ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. నిజంగానే వైఎస్ వివేకా కుటుంబలో జగన్‌కు వ్యతిరేకంగా పని చేశారా, అందులో భాగంగానే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకుందా అనే విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇరు కుటుంబాల మధ్య ఉన్న వైరం మరోసారి వెలుగులోకి వస్తుందా అని డిస్కషన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసిన తర్వాత జగన్, విజయమ్మకు ప్రత్యర్థిగా వివేకా పోటీ చేశారు. అప్పట్లో సంచలనంగా మారారు. ఇప్పుడు దాన్ని గుర్తుచేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
వివేకానంద మృతిని మొదట గుండెపోటుగా అంతా భావించారు. కానీ ఆ తరువాత హత్యగా తేలడంతో వివాదంలోకి రాజకీయం చొరబడింది. జగన్ స్వయంగా సీబీఐ విచారణను డిమాండ్ చేయటం, ఆ తరువాత కొద్ది రోజులకే అధికారంలోకి వచ్చిన జగన్ సీబీఐ విచారణ అవసరం లేదని స్టేట్‌పోలీస్‌తోనే దర్యాప్తు చేయించారు. కానీ వైఎస్ వివేక కుమార్తె సునీత ఎంట్రీ ఇచ్చి.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని యుద్ధం మొదలు పెట్టారు. ఇది చివరకు వివేకా ఫ్యామిలీ వర్సెస్ జగన్ ఫ్యామిలీ మధ్య వార్‌లా మారింది. అన్న పై చెల్లెలు, చెల్లెలపై అన్న ఆరోపణలు చేసుకున్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఇదే విషయాన్ని కొడాలి నాని డైరెక్ట్‌గా చెప్పారు. అసలు వివేకా ఫ్యామిలీలో జగన్ మంచి కోరే వారు లేరన్నట్టు కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట నడవలేదని, సీఎం జగన్ నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారని అన్నారు. వైఎస్ వివేకా చనిపోవడం వల్ల సీఎం జగనుకేమైనా ఆస్తి వచ్చిందా..? పదవి ఏమైనా వచ్చిందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.
జగన్ ఆదేశాలతోనే కొడాలి ఈ కామెంట్స్ చేశారా లేకుంటే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్తారా అనేది తేలాల్సి ఉంది. ఇంత వరకు బయట డిస్కషన్‌లోకి రాని కొత్త పాయింట్‌తో వైసీపీ అటాక్ మొదలు పెట్టిందనే టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వివేక హత్య కేసును అస్త్రంలా వాడుకున్న వైసీపీ ఇప్పుడు అదే అస్త్రం ప్రత్యర్థులకు చేరుకున్న టైంలో ఈ కొత్త పాయింట్‌తో వచ్చే ఎన్నికల నాటికి దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. కావాలనే ప్రత్యర్థులు రాజకీయం చేస్తున్నారనే కలరింగ్ ఇచ్చి... జనాల్లో దీనిపై పెద్దగా చర్చ జరగకుండా ప్లాన్ చేసిందనేది విశ్లేషకులు అభిప్రాయం.
తెలుగుదేశం మాత్రం ఈ అస్త్రానికి మరింత పదును పెట్టి వాడుకోవాలని చూస్తోంది. ఇద్దరి చెళ్లెళ్లకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వెనుక పూర్తిగా జగన్ ఫ్యామిలి ఉందని కావాలనే విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తెలుగు దేశం ట్రాప్ లో వైసీపీ
వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలుగుదేశం మొదటి నుంచీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. తాజాగా జగనాసుర రక్త చరిత్ర పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తెలుగు దేశం రిలీజ్ చేసింది. దీనిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్‌లో విరుచుకుపడింది. అయితే తెలుగు దేశం వివేకా హత్యను కేంద్రంగా చేసుకొని మొదలు పెట్టిన రాజకీయ ట్రాప్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిక్కుకుందని అందులో భాగంగానే కోడాలి నాని వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.