వైసీపీ తరఫున పోటీ చేసే ఉద్దేశం లేదు- క్లారిటీ ఇచ్చిన మాజీ ఐపీఎస్ లక్ష్మినారాయణ
ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన ఆ పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఏర్పాటు చేసుకుంటున్న పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని ఆహ్వానించడానికే వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ టైంలో అక్కడ ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి తనను పిలిచారని వివరించారు. ఆ సమావేశంలో తాను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించనే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు.
ఒక కార్యక్రమానికి వెళ్లి అభినందించినంత మాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు లక్ష్మీనారాయణ. వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి ఉద్దేశం తనకు లేదని వివరించారు. జరుగుతున్న ప్రచారం, ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదని ఖండించారు లక్ష్మీనారాయణ. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు.
శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను…
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) October 30, 2023
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణితో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా హాజరైన లక్ష్మీ నారాయణ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పొగడుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు చాలా మంచివని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల గత కొన్నేళ్లకి, ఇప్పటికీ చాలా మారిందని కొనియాడారు. ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలకు పౌష్ఠికాహారం బాగా అందుతోందని లక్ష్మీ నారాయణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా ముస్తాబయ్యాయని అన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు ఒకరోజు మెడికల్ క్యాంపులు పెడుతుంటాయని, కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుల తరబడి క్యాంపులు కొనసాగించడం మంచిగా ఉందని కొనియాడారు. డాక్టర్లు నేరుగా వచ్చి మెడికల్ టెస్టులు చేసి అవసరమైన పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు. స్కూలు పిల్లలకు రాగి జావ అందిస్తుండడం, మద్యాహ్నం భోజనం నాణ్యంగా ఉండేలా చూడటం కూడా అభినందనీయమని అన్నారు.
సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని లక్ష్మీనారాయణ పొగడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నేళ్ల క్రితం లక్ష్మీ నారాయణ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో వివిధ ఛానెళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా జగన్ వ్యక్తిత్వం, వైఖరి గురించి లక్ష్మీ నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్‌ను పొగడటంతో ఆయన వైసీపీ నుంచు పోటీ చేయడం ఖాయమనే వార్తలు వెలువడ్డాయి. ఆయన అభిమానులు కూడా ఈ పరిణామంతో విస్తుపోయారు. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.