MP Elections 2023: ఇక మహిళలను విడదీయాలని ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
MP Elections 2023: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల కోసం పనిచేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో సరైన సమయంలో సరైన విధంగా పరిపాలించి ఉంటే అసలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరమే ఉండేది కాదని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా కావాలని డిమాండ్ చేస్తూ దేశంలోని మహిళలను విభజించే ప్రయత్నం చేస్తోందని మోదీ ఆరోపించారు. బీజేపీ జన ఆశీర్వాద యాత్ర ముగింపు సందర్భంగా భోపాల్‌లో జరిగిన కార్యకర్త మహాకుంభ్ కార్యక్రమంలో మోదీ పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు బలవంతంగా మద్దతు ఇచ్చాయని, మహిళా శక్తికి వారు భయపడ్డారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో నారీ శక్తి వందన్ అభియాన్ (మహిళా రిజర్వేషన్ బిల్లు) చరిత్ర సృష్టించిందని, దేశంలోని మహిళలు ఎన్నో దశాబ్దాలుగా దీని కోసం ఎదురుచూశారని, ఇది ఎప్పటికీ జరగదని భావించారని మోదీ వెల్లడించారు. అయితే మోదీ ఉండగా ప్రతి హామీ నెరవేరుతుందని అన్నారు. కాంగ్రెస్, దాని 'ఘమండియా' కూటమి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ హెచ్చరించారు. ఈ బిల్లును కూడా వారు అయిష్టంగానే సమర్థించాయని అన్నారు.
అలాగే మోదీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ మరిన్ని ఆరోపణలు చేశారు. దేశ రాష్ట్రపతి స్థానంలో ఓ గిరిజన మహిళ రాకూడదని వీళ్లు శాయశక్తులా ప్రయత్నించారని అన్నారు. ఆమెన కించ పరిచేందుకు కూడా పదే పదే ప్రయత్నించారని విమర్శించారు. దేశ సాయుధ దళాలలో మహిళలను రానీయకుండా ఆపిన వారు వీళ్లేనని మోదీ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం నాటి 'గరీబీ హటావో' ప్రచారాన్ని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ అలా చేయగలిగిందా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మురికి వాడలు వీడియోలు షూట్ చేయడానికి, అడ్వెంచర్ టూరిజం లొకేషన్లుగా ఉపయోగపడతాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేకపోయిందని, దేశం ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మోదీ వెల్లడించారు. పేద వాళ్ల జీవితాల గురించి వాళ్లకి ఏమాత్రం పట్టదని, ఎందుకంటే వాళ్లు పుట్టడమే వెండి చెంచాతో పుట్టారని అన్నారు. పేదల జీవితాలంటే వారికి అడ్వెంచర్ టూరిజం అని ఆరోపించారు. వీళ్లు గతంలో కూడా ఇలాగే చేశారని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం భారత దేశాన్ని అభివృద్ధి చేస్తోందని, అభివృద్ధి చెందిన , గొప్ప భారత్‌ను ప్రపంచానికి చూపిస్తోందిన మోదీ తెలిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టగా అది లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు ఇస్తూనే.. ఈ బిల్లులో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా మహిళలు ఎదురుచూస్తున్నారని బిల్లును వెంటనే అమలు చేయాలని కోరింది.