Telangana News: తెలంగాణలోనే ఉన్న "క" సినిమాలో చెప్పిన క్రిష్ణగిరి- సాయంత్రం 4 గంటలకే చీకటి
KA Movie:సినిమాల్లో చూపించే కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటివి నిజ జీవితంలో ఉన్నాయంటే వణుకు పుడుతుంది. అయితే దాని వెనకున్న అసలు విషయం తెలిస్తే వెళ్లి చూడాలనిపిస్తుంది. అలాంటిదే ఇది
Kodurupaka In Peddapalli District : "క" సినిమా చూపించిన క్రిష్ణగిరి గ్రామంలో సాయంత్రం మూడు గంటలకే చీకటి పడుతుంది. ఇలాంటి గ్రామమే తెలంగాణలో కూడా ఉంది. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతుంది. ప్రజలంతా ఆ సమయానికి ఇంటికి చేరుకుంటారు. ఈ గ్రామంలో సూర్యడు త్వరగా రాడు... త్వరగా అస్తమిస్తాడు.. గుడి ఉంటు కానీ దేవుడు ఉండడు. ఇలాంటివి చెబితే వణుకు పడుతుంది కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం అక్కడకు వెళ్లి ఒకరోజు ఉండి నేరుగా ప్రకృతి విచిత్రాన్ని చూడాలనిపించక మానదు.
కృష్ణగిరిలాంటి కొదురుపాక
ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం సాయంత్రం ఆరు తర్వాత సూర్యాస్తమయం మన సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే ఈ మధ్య వచ్చిన "క" సినిమాలో ఓ గ్రామంలో సాయంత్రం మూడుగంటలకే చీకటి పడుతుంది. ఆ తర్వాత అక్కడ జరిగే పరిణామాలు హడలెత్తిస్తాయి. అలాంటి గ్రామం ఒకటి ఉంటుందా అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుది. నిజంగానే అలాంటి గ్రామం ఉందంటే మాత్రం ఆశ్చర్యపోతారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కృష్ణగిరిలాంటి గ్రామం ఉంది. దానిపేరే కొదురుపాక.
అక్కడ మూడు జాములే
సుల్తానాబాద్ మండంలో ఉన్న కొదురుపాకను మూడు జాముల కొదురుపాక అంటారు. అంటే సర్వసాధరణంగా ఏ ప్రాంతంలోనైనా నాలుగు జాములు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కొదురుపాకలో మాత్రం కేవలం మూడు జాములే ఉంటాయి. అంటే ఇక్కడ సాయంత్రం ఉండనే ఉండదు. నాలుగు గంటలు అయ్యేసరికి చీకటి పడుతుంది. పూర్తిగా సూర్యుడు కనిపించకుండా పోతాడు. అందుకే ఆ గ్రామంలో ఉండే వాళ్లకు సాయంత్రం తెలియనే తెలియదు.
సూర్యోదయం ఆలస్యం- వేగంగా సూర్యాస్తమయం
ఈ కొదురుపాకలో ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించనే కనిపించడు. సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. అంటే కేవలం ఏడెనిమిది గంటలు మాత్రం సూర్యుడు కనిపిస్తాడు. దీనికి ఆ గ్రామానికి ఎలాంటి శాపాలు, అద్భుతాలు లేవు. ఈ ఊరు నాలుగు కొండల మధ్య ఉంటుంది. ఆ కొండలు దాటిన తర్వాతే సూర్యుడు కనిపిస్తాడు. అందుకే సూర్యోదయం ఆలస్యంగా సూర్యాస్తమయం త్వరగా అవుతుంది.
దేవుడి లేని గుడి
దశాబ్ధాలుగా అక్కడే ఉండే వాళ్లకు ఇది మామూలు విషయమే. కానీ అక్కడకు కొత్తగా వెళ్లే వాళ్లకు మాత్రం ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఈ వింతను చూసేందుకు కూడా చాలా మంది అప్పుడప్పుడు అక్కడకు వెళ్తుంటారు. ఇక్కడ ఉండే నరసింహస్వామి ఆలయంలో దేవుడు లేడు. దసరా సందర్భంగా పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి నరసింహ స్వామిని రథంపై ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టిస్తారు. అనంతరం వేడుకలు జరుపుతారు. పూజలు పూర్తైన తర్వాత మళ్లీ దేవునిపల్లికి విగ్రహాన్ని తరలిస్తారు.
Also Read: తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు