Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు వచ్చేది.. చివరిక్షణంలో రాకుండా కుట్ర చేశారన్న నిర్మాత శ్రీరామ్
తెలుగులో చిరంజీవికి తొలి నేషనల్ అవార్డు రావాల్సి ఉన్నా, కుట్రల కారణంగా రాలేదా? నార్త్, సౌత్ అనే వివాదంలో నార్త్ వాళ్లకే ఇచ్చుకున్నారా? అవునంటున్నారు ప్రముఖ నటుడు, నిర్మాత శ్రీరామ్.
Producer Sri Ram Edida About Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస హిట్లతో మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు మించిన గ్రేస్ తో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే, మెగాస్టార్ కు జాతీయ అవార్డు రాకుండా కొంతమంది కుట్రలు చేశారన్నారు ప్రముఖ నిర్మాత, నటుడు శ్రీరామ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ‘ఆపద్బాంధవుడు’ సినిమాకు జాతీయ అవార్డు దాదాపు ఖరారు అయినా, చివరి క్షణంలో నార్త్ వారికే ఇచ్చుకున్నారని చెప్పారు.
“మెగాస్టార్ చిరంజీవితో మూడు సినిమాలు చేశాం. అందులో ఒకటి ‘తాయారమ్మా బంగారయ్యా’. రెండోది ‘స్వయంకృషి’. మూడోది ‘ఆపద్బాంధవుడు’. ‘ఆపద్బాంధవుడు’ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చేసింది. అనౌన్స్ చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో నార్త్, సౌత్ అనే డిఫరెన్సెన్స్ వచ్చాయి. వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అప్పట్లో సౌత్, నార్త్ అనే తేడా చాలా ఎక్కువగా ఉండేది. సౌత్ వాళ్లను ఈజీగా తీసిపారేసే వాళ్లు. లేకపోతే తెలుగులో మొట్టమొదటి నేషనల్ అవార్డు చిరంజీవికే వచ్చేది” అన్నారు. ప్రస్తుతం శ్రీరామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
. @KChiruTweets గారికి #ఆపద్బాంధవుడు చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది, ఇక ప్రకటిస్తారు అనగా నార్త్ - సౌత్ అనే తేడాతో చివరి నిమిషంలో వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు. లేకపోతే తెలుగులో మొట్టమొదటి నేషనల్ అవార్డు ఆయనకే వచ్చేది.
— Praveen (@AlwaysPraveen7) November 3, 2024
- నిర్మాత, నటుడు శ్రీరామ్ pic.twitter.com/yPtD3Ev2uU
‘ఆపద్బాంధవుడు’ సినిమా గురించి..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మర్చిపోలేని చిత్రం ‘ఆపద్బాంధవుడు’. కళాతపస్వి కె విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో తొలి సినిమా ‘శుభలేఖ’.1982లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో సినిమా ‘స్వయంకృషి’. 1987లో ఈ సినిమా విడుదల అయ్యింది. మూడో సినిమా ‘ఆపద్బాంధవుడు’. 1992 అక్టోబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలు చిరంజీవి కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చాయి. ఈ మూడు చిత్రాలతో చిరంజీవి తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల, శరత్ బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, సి నారాయణరెడ్డి, సిరివెన్నెల, భువనచంద్ర పాటలు రాశారు. ఈ చిత్రానికి ఏకంగా ఐదు నంది అవార్డులు లభించాయి. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డును పొందారు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి జాతీయ అవార్డు ఖరారు చేసినా, చివరి క్షణంలో అవార్డును వేరేవాళ్లకు ఇచ్చినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి.
‘విశ్వంభర’ షూటింగ్ లో చిరంజీవి బిజీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర‘ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘ సంక్రాంతి బరిలో నిలవడంతో, ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
Read Also: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక