What is Modi Plan : ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారు ? పూర్తి జమిలీనా ? పాక్షిక జమిలీనా ?
జమిలీ ఎన్నికలపై కేంద్రం తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజాస్వామ్యంలో మౌలికమైన మార్పును తీసుకు రానుంది. అందుకే ప్రధాని మోదీ ఆలోచనలు ఎలా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది.
What is Modi Plan : దేశ రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి సంబంధించి అతి కీలకమైన నిర్ణయాలను తీసుకోవడానికి బీజేపీ పెద్దలు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తాజా పరిణామాలను బట్టి దేశ ప్రజలు ఓ అంచనాకు వస్తున్నారు. ఆ కీలక నిర్ణయాలు ఏమిటన్నది మాత్రం ఎవరి ఊహకు అందడం లేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండాను ఇంత వరకూ బహిర్గత పర్చలేదు. త్వరలో చెబుతామంటున్నారు. అదేమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఖచ్చితంగా జమిలీ ఎన్నికల నిర్ణయం జరగబోతోందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. దీనికి కారణం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో జమిలీ ఎన్నికలపై కమిటీ వేయడం .. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నివేదిక ఇవ్వాలని సూచించజం ఓ సూచికగా కనిపిస్తోంది. కానీ అంతకు మించి దేశం ఆశ్చర్యపోయే నిర్ణయాలు ఉంటాయన్న చర్చ కూడా జరుగుతోంది.
ఢిల్లీలో వేగంగా మారిపోతున్న పరిణామాలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించిన తర్వాత ఢిల్లీలో ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అని కేంద్రం ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. వెంటనే వన్ నేషన్ -వన్ ఎలక్షన్ తెరపైకి వచ్చింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కమిటీ.. సెప్టెంబర్ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. దీనిపై ఢిల్లీతోపాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రామ్ నాథ్ కోవింద్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యాడు. ఏం చర్చించారో తెలియదు కానీ.. బీజేపీ అనుకూల పక్షాలన్నీ జమలీ ఎన్నికలకుమద్దతుగామాట్లాడటం ప్రారంభించాయి.
అధికారులంతా ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు
మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ ఢిల్లీలోనే ఉండాలని.. రాష్ట్రాల పర్యటనలు రద్దు చేసుకోవాలని.. మిగతా అన్ని పనులు రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వచ్చేయాలని ఆదేశించింది కేంద్రం. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి ఢిల్లీ వదిలి వెళ్లరాదంటూ హుకూం జారీ చేసింది. ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురానున్నందున అధికారులపై ఈ ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది.
జమిలీ కోసం రాజ్యాంగ సవరణలు !
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని లా కమిషన్ ఇప్పటికే సూచించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం నిరంతరం ఎన్నికల మోడ్ లో ఉండకుండా నిరోధించవచ్చు. అందువల్ల పరిపాలన దృష్టి అభివృద్ధి పైనే ఉంటుందని లాకమిషన్ నివేదిక సూచించింది. కానీ ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదని కూడా కమిషన్ నివేదికలో పేర్కొంది. ఇది జరగాలంటే రాజ్యాంగంలో సవరణ అవసరం అని తెలిపింది. అందుకే రాజ్యాంగ సవరణల బిల్లును ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో వెల్లడించారు. అయితే ఆ సవరణల కోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
ఏ మార్పు జరిగినా ప్రజాస్వామ్యంలో కీలకమే !
కేంద్రం ఏ మార్పులు తీసుకు రావాలనుకుంటున్నా.. ప్రజాస్వామ్యంలో కీలక మార్పులు రానున్నాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మార్పు వస్తుంది. ఇది దేశానికి మంచిదా కాదా అన్నది.. బిల్లులు పెట్టిన తర్వాత ఎలాగూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ కేంద్రం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. ఎందుకంటే అధికారం కేంద్రం చేతుల్ల ోఉంది. ఒక వేళ ప్రజావ్యతిరేకమైనా ఆమోదిస్తే బీజేపీ పెద్దలు మూల్యం చెల్లించుకుంటారు.