Telangana Problems: సంక్షేమం సరిపోతుందా.. ప్రజాసమస్యలు పరిష్కరించవద్దా? - తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఇదే అసలు అసంతృప్తి !
Telangana:సంక్షేమంపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి తగ్గించిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగా రోడ్ల మరమ్మతులు వంటి చిన్న చిన్న పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Telangana government reduced its focus on infrastructure: తెలంగాణలో ప్రస్తుతం సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అనే అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఆరు గ్యారెంటీల అమలుకు పెద్దపీట వేసింది. 2025-26 బడ్జెట్‌లో ఏకంగా రూ. 56,000 కోట్లను కేవలం ఈ గ్యారెంటీల కోసమే కేటాయించడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది. అయితే, ప్రజలను నేరుగా ఆకట్టుకునే నగదు బదిలీ, ఉచిత పథకాలపై పెడుతున్న దృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై తగ్గిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల మరమ్మతులు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక పనులు కూడా నిధుల లేమితో అగిపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతోంది.
అభివృద్ధి పనులన్నీ ఎక్కడివక్కడే !
ముఖ్యంగా గతంలో ఆర్భాటంగా ప్రకటించి శంకుస్థాపనలు చేసిన పలు ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉదాహరణకు, MMTS రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఇవ్వాల్సిన సుమారు రూ. 381 కోట్లు విడుదల చేయకపోవడంతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు. అదేవిధంగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల బకాయిలు పెరిగిపోవడం వల్ల పనులు మందగించాయి. కేవలం రైల్వేలే కాకుండా, సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన దేవాదుల వంటి ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా 2025 నాటికి పూర్తి కావాల్సిన గడువును దాటి 2027కు వాయిదా పడ్డాయి.
కాంట్రాక్టర్లకు బకాయిలు - కొత్తప పనులు చేయడానికి ముందుకు రాని వైనం
ప్రభుత్వ వ్యూహం ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం , పేదలకు తక్షణ ఊరటనివ్వడం చుట్టూ తిరుగుతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి వంటి పథకాలు లబ్ధిదారులకు మేలు చేస్తున్నా.. దీర్ఘకాలికంగా ఆదాయాన్ని సృష్టించే మౌలిక సదుపాయాల కల్పన అటకెక్కడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, కొత్త పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న అభివృద్ధి పనులు సైతం నిలిచిపోయి, ప్రజలు రోజువారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ ప్రాజెక్టులూ మాటలకే పరిమితం
ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ , రీజినల్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భూసేకరణ సవాళ్లు , నిధుల సమీకరణ పెద్ద అడ్డంకులుగా మారాయి. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం వంటి అత్యవసర ప్రాజెక్టుల విషయంలో శంకుస్థాపన చేసినా, అసలు పనులు ప్రారంభం కావడానికి నెలల తరబడి సమయం పడుతోంది. ఆరోగ్య, విద్యా రంగాల్లో మౌలిక వసతుల లేమిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలు కోసం చేస్తున్న అప్పులు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే అవకాశం ఉండటంతో, భవిష్యత్తులో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం మరింత కష్టతరం కానుందిన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కేవలం సంక్షేమ పథకాలతోనే ఓటర్లను మెప్పించవచ్చని భావించడం ప్రభుత్వానికి రాజకీయంగా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. ఎందుకంటే, ప్రజలు పథకాలతో పాటు మెరుగైన రోడ్లు, సాగునీరు, మౌలిక సదుపాయాలను కూడా కోరుకుంటారు. నిధులన్నీ పథకాలకే మళ్లిస్తూ, కంటికి కనిపించే అభివృద్ధిని విస్మరించడం వల్ల మధ్యతరగతి, పట్టణ ఓటర్లలో వ్యతిరేకత మొదలవుతోంది. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సరైన సమతుల్యత పాటించకపోతే, అది రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.





















