Telangana Elections 2023 : బీసీ నినాదం - జనసేన సపోర్ట్ ! బీజేపీకి తెలంగాణలో తిరుగు ఉండదా ?
బీసీ నివాదం, పవన్ సపోర్ట్ పై బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుందా ? మోదీ ప్రచారం తర్వాత బీసీలంతా బీజేపీ వైపు మళ్లు తారా ?
Telangana Elections 2023 : హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) బీసీ ఆత్మగౌరవ సభలో బీజేపీ గెలుస్తుంది.. బీసీని సీఎంను చేస్తుందని ప్రకటించారు. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మోదీ వ్యక్తం చేసినంత కాన్ఫిడెంట్ గా బీజేపీకి లేవని చెప్పుకోవచ్చు. ప్రధాన పోటీదారుల్లో బీజేపీ(BJP) లేదని అనేక సర్వేలు(Elections Survey) వెల్లడించాయి. అయితే బీజేపీ మాత్రం ప్లాన్ బీతో ఎవరూ ఊహించని విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్లాన్ బీ ఏమిటన్నదాని సంగతి పక్కన పెడితే.. బీసీ సీఎం విషయంలో బీజేపీ అంత నమ్మకంగా ఉండటానికి కారణం ఏమిటి ? పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఏముంది ? బీసీ సీఎం, పవన్ పొత్తు గేమ్ ఛేంజర్(Game Changer) అని ప్రధాని మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆయన ప్రసంగాన్ని చూస్తే అర్థం అవుతుంది. మరి బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ తర్వాత తెలంగాణ బీసీల్లో బీజేపీ కోరుకున్నంత కదలిక వస్తుందా ?
బీసీ నినాదంపై గట్టి ఆశలు పెట్టుకున్న బీజేపీ
తెలంగాణ బీజేపీ(Telangana BJP) బీసీ నినాదంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లుగా ప్రధాని(Prime Minister) మోదీ ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తెలుగుదేశం పార్టీ బీసీ నినాదాన్ని అందుకుంది. పార్టీలో ఉన్న బీసీ నేతలకు పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి అనుకూలత రాదని.. బీసీ సంక్షేమ సంఘం నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య(R Krishnaiah)ను పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఎల్బీ నగర్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాలను గెల్చుకోగా.. టీడీపీ 14 చోట్ల విజయం సాధించింది. బీసీ సీఎం నినాదం ఇంత పవర్ ఫుల్ గా ఉంటుందని బీజేపీ నిర్ణయించుకుని ఇప్పుడు అదే వ్యూహం అమలు చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అప్పట్లో టీడీపీకి బదులు ఇప్పుడు జనసేన
అప్పట్లో తెలుగుదేశం(Telugu Desam Party) మేజర్ ఫోర్స్ గా ఉంది. ఇప్పుడు పూర్తిగా చతికిలపడిపోయింది. అసలు పోటీ నుంచి విరమించుకుంది. కానీ జనసేన(Janasena) రూపంలో బీజేపీకి కూటమి పార్టీ లభించింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదనుకుని అంగీకరించారు. పవన్ కల్యాణ్‌కు మున్నూరు కాపు వర్గంతో పాటు ఆయన ఫ్యాన్స్ అన్ని వర్గాల్లోనూ ఉంటారని ఇది కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు పార్టీల కూటమి తెలంగాణను దున్నేస్తుందని ఆ పార్టీ నేతలేమీ ఆశలు పెట్టుకోవడం లేదు కానీ.. హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతామన్న నమ్మకంతో ఉన్నట్లుగా భావిస్తున్నరు. అందుకే పవన్ తో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు ఎక్కువ ాసక్తి చూపించారని అంటున్నారు. 2014 తరహాలోనే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ఇరవై వరకూ సీట్లు సాధిస్తే... హంగ్‌లో కింగ్ అవడం ఖాయమన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
బీసీ సెంటిమెంట్ ను బీజేపీ ప్రజల్లో పూర్తి స్థాయిలో రాజేయగలిగిందా ?
తెలంగాణలో బీసీలు నిర్ణయాత్మక శక్తి.కానీ వారంతా ఏకతాటిపైన లేరు. బీసీ కులాలన్నీ సమైక్యంగా ఉంటే.. వారు అజేయమైన శక్తి . కానీ రాజకీయాల్లో ఏ కులం అయినా కుల సమూహం అయినా ఏకతాటిపైన ఉండదు. ఓ పార్టీపై ఎక్కువ అభిమానం చూపించవచ్చు కానీ..అన్ని పార్టీల్లో అన్ని కులాల వారూ ఉంటారు. అలాగే బీసీలు కూడా వివిధ పార్టీల మద్దతుదారులుగా ఉంటారు. వీరిలో ఎంత మందిని బీసీ సీఎం నినాదంతో బీజేపీ తన వైపు మల్చుకుంటుందన్నది కీలకం. పవన్ మద్దతుతో బీసీ సీఎం నినాదానికి బలం చేకూరిందని బీజేపీ నమ్ముతోంది. ఎంత ఎక్కువ సెంటిమెంట్ రాజేస్తే అంత ఎక్కువ లాభం అని అనుకుంటోంది. కానీ బీజేపీ అనుకున్నంతగా సెంటిమెంట్ వర్కవుట్ అయిందా లేదా అన్నదే ప్రశ్న.