Gutta Sukhender on Jamili: జమిలీ కాకపోతే మినీ జమిలీ అట - కేంద్రంపై గుత్తా సుఖేందర్ ఫైర్
తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికలు జరగవా? జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనా? కేంద్రం ఏం ఆలోచిస్తోంది? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం చెప్తున్నారు?
జమిలీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎలాగైనా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోందన్నారు. అందుకే ఎన్నికలు విషయంలో.. దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. డిసెంబర్‌లోగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. కేంద్రం వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టారు. జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలను గందరగోళంలో పడేశారన్నారు. జమిలీ ఎన్నికలు సాధ్యం కాకపోతే మినీ జమిలీ నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు, రాజకీయ పార్టీలను గందరగోళ పరిచి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఇప్పటికే కమిటీ వేసింది మోడీ సర్కార్. ఈనెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కమిటీ ఇచ్చే నివేదికను సభలో పెట్టబోతుందని సమాచారం. అయితే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. దీంతో జమిలీ సాధ్యం కాకపోతే... మినీ జమిలీ ఎన్నికలు అయినా నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందట. మినీ జమిలి అయితే... అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని మోడీ సర్కార్ భావిస్తోంది. మినీ జమిలి కూడా జనవరి, ఫిబ్రవరిలో కాదు.. ఏప్రిల్, మేలో జరగొచ్చనే అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణ, మిజోరం, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే... 2024లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ సహా 12 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే... డిసెంబర్‌లోగా జరగాల్సిన తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహించొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదా... లోక్‌సభ ఎన్నికలనే ముందుగా జరపొచ్చని భావిస్తున్నారు.
జమిలీ ఎన్నికలపై తెలంగాణ నేతలు కూడా లీకులు ఇస్తుండటంతో... అదే జరగొచ్చని ప్రజలు భావిస్తున్నారు. అయితే... తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఎన్నికలు సమయానికి జరిగినా... ఆలస్యమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం. మొత్తంగా రాష్ట్రంలో రాష్ట్రంలో జమిలీ ఎన్నికలే హాట్ టాపిక్‌గా మారాయి.