TDP Assembly : ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ! ఏపీలో విచిత్ర పరిస్థితి
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ ఆసక్తి చూపించడంలేదు. వెళ్లినా సభలో మాట్లాడే చాన్స్ రాకపోగా వైఎస్ఆర్‌సీపీ సభ్యుల బూతుల బారిన పడాల్సి వస్తుందని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ( Andhra Pradesh Assembly ) సమావేశాలు ఏడో తేదీ నుండి ప్రారంభం కాబోతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార-ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగుతాయని అనుకుంటారు. కానీ ఏపీ అసెంబ్లీలో ఈ సారి అలాంటి పరిస్థితులేమీ ఉండే అవకాశం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ( TDP ) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని.. బాయ్ కాట్ ( BOYCOTT ) చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మళ్లీ సీఎంగానే సభలో అడుగు పెడతానని చంద్రబాబు సవాల్ చేసి బాయ్ కాట్ చేశారు. ఆయన మళ్లీ సభలో అడుగు పెట్టే అవకాశం లేదు.
అయితే ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశాల్ని బాయ్ కాట్ చేశారు. సందర్భాన్ని బట్టి సభకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై టీడీపీ హైకమాండ్ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. కానీ వెళ్లకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ( Opposition MLAs ) సభలో ఇష్టారీతిన అవమానించడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని.,. సభకు వెళ్లినా అలాంటి అవమానాలు పడాల్సిందే కానీ సభలో మట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వరని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరును సభలో కన్నా బయటే ఎండగట్టడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు.
శాసనమండలికి కూడా టీడీపీ సభ్యులు వెళ్లే అవకాశం లేదు. శాసనమండలి సభ్యులు కూడా సమావేశాలను బహిష్కరిస్తే మొత్తంగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరుగుతాయి. శాసనమండలిలో అయినా కొంత మంది ప్రతిపక్ష సభ్యులు ఉంటారమో కానీ శాసనసభలో మాత్రం ఒక్కరు కూడా ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సభ సాగుతుంది. జనసేనకు ఓ సభ్యుడు ఉన్నప్పటికీ ఆయన వైఎస్ఆర్‌సీపీ కండువాలతోనే నేరుగా నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. రికార్డుల్లో మాత్రం జనసేన ఎమ్మెల్యే అనే పేరు ఉంటుంది.
గతంలో పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదన్న కారణంతో వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను రెండేళ్ల పాటు బహిష్కరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలకే హాజరవకపోతే.. తర్వాత సమావేశానికి హాజరవడం కూడా కష్టంగా మారుతుంది. అదే జరిగితే సమావేశాలు అన్నీ ఏకపక్షంగా సాగినట్లవుతుంది.