(Source: ECI/ABP News/ABP Majha)
నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి పరామర్శలు- భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రకు లోకేష్ సిద్ధం
చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి రెడీ అయ్యారు. నిజం గెలవాలి పేరుతో ఆమె జనాల్లోకి వెళ్లబోతున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్లాన్ బి అమలుకు సిద్ధమైంది. కోర్టుల్లోనే న్యాయం కోసం పోరాడుతూనే ప్రజల్లోకి వెళ్లి జరిగిన విషయాలను చెప్పాలని భావిస్తోంది. జనాల్లోకి చంద్రబాబు కుటుంబం వెళ్తుందని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తోంది. ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది.
బ్రాహ్మణి కాదు భువనేశ్వరి
నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు బదులు నారా భువనేశ్వరి జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఓ వైపు భువనేశ్వరి, మరోవైపు నారా లోకేష్ కూడా యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి యువగళం పాదయాత్రను పక్కన పెట్టి గతంలో చంద్రబాబు చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీని మళ్లీ కొనసాగించాలని నిర్ణయించారు.
నిజం గెలవాలి పేరుతో యాత్ర
చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి రెడీ అయ్యారు. నిజం గెలవాలి పేరుతో ఆమె జనాల్లోకి వెళ్లబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ రానుంది. వారంలో కనీసం రెండు మూడు చోట్ల పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ మొదటి వారంలో యాత్ర
అక్టోబర్ మొదటి వారం నుంచే జనాల్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే కోర్టుల్లో కేసుల్లో తీర్పు ఎప్పుడైనా రావచ్చని అంచనాతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటికి సమయం పడుతుందని... ప్రభుత్వం కూడా ఒకదాని తర్వాత ఒక కేసు పెడుతోంది. ఇంతలో దసరా సెలవులు కూడా రానున్నాయి. అంటే కేసులపై నిర్ణయం రావడానికి ఇంకా పది పదిహేను రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే జనాల్లోకి వెళ్లడమే ఉత్తమమని పార్టీ భావిస్తోంది.
లోకేష్ బస్ యాత్ర
చంద్రబాబు అరెస్టుకు ముందు ఓ వైపు లోకేష్ పర్యటన, మరో వైపు భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో అధినేత టూర్ టీడీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండేది. కాని చంద్రబాబు అరెస్టు తర్వాత ఒక్కసారిగా పార్టీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. చంద్రబాబుకు మద్దతుగా అంటూ నియోజకవర్గాల్లో నేతలు దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు. మరికొందరు భువనేశ్వరిని కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఇంకా ఎన్నికలు ఆరు నెలలు సమయం ఉన్న టైంలో పార్టీ ఇంత నిస్తేజంగా ఉంటే ప్రమాదమని గ్రహించిన నేతలు యాక్టివిటీ పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకానొక దశలో లోకేష్ తన యువగళం పాదయాత్ర పునఃప్రారంభిస్తారని అనుకున్నారు. పార్టీ తరఫున అధికారికంగా తేదీ ఖరారు చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. న్యాయపోరాటం చేస్తున్న పార్టీకి కోఆర్డినేషన్ అవసరమని గ్రహించిన ఆ నిర్ణయాన్ని లోకేష్ తాత్కాలికంగా వాయిదా వేశారు.
కోర్టుల్లో కేసులు నడుస్తున్న టైంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని చంద్రబాబుతో సమావేశం కావాల్సి ఉంటుందని అందుకే పాదయాత్ర పదే పదే ఆపితే బాగుదని చంద్రబాబు బయటకు వచ్చే వరకు యువగళం యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. దాని ప్లేస్‌లో చంద్రబాబు చేపట్టిన భవిష్యత్‌కి గ్యారెంటీ పేరుతో బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
శనివారం షెడ్యూల్
శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. యాత్రలకు సంబంధించిన షెడ్యూల్ రూట్‌మ్యాప్‌లపై క్లారిటీ వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.