Andhra Politics: రాయలసీమను తలపిస్తున్న పల్నాడు రాజకీయం - ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ఉత్కంఠ!
Andhra Pradesh Elections 2024: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. కీలక నియోజకవర్గాల్లో గెలుపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Krishna,Guntur Politics: రాజకీయ చైతన్యానికి మారుపేరురైన కోస్తాంధ్ర జిల్లాల్లో ఈసారి పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా(Krishna), గుంటూరు(Guntur) జిల్లాల్లో రాజకీయం కాకరేపుతోంది. మాటల యుద్ధం పరిధులు దాటి దాడుల వరకు వెళ్లింది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం నివురుగప్పిన నిప్పులా దాగి ఉంది. అటు బెజవాడలోనూ గెలుపును ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అతి సున్నితమైన, కీలకమైన నియోజకవర్గాల్లో గెలుపోటముల గురించి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
కృష్ణా గురి ఎటు!
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరిచూపు బెజవాడపైనే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ బెజవాడ కేంద్రంగానే రాజకీయాలు సాగేవి. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే కృష్ణా(Krishna), గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పోటీపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మరింత ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. అవే ఒకటి గుడివాడ, రెండోది గన్నవరం(Gannavaram). చంద్రబాబుపైనా, ఆయన కుటుంబంపైనా తీవ్రమైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడమేగాక.... నోరు తెరిస్తే బూతుపురాణంతో విరుచుకుపడే కొడాలినాని(Kodali Nani)కి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టేందుకు తెలుగుదేశం మూడేళ్ల ముందు నుంచే వ్యూహాలు రచించింది. కొడాలి నానిపై బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎన్నారై వెనిగండ్ల రామును రంగంలోకి దించింది.
ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేస్తే జనం నమ్మేస్థితిలో ఇప్పుడు లేరు. కాబట్టి ఆయన మూడు, నాలుగేళ్లు ముందు నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం తరపున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతోనూ సమన్వయం చేసుకుని ముందుకు సాగారు. అటు కొడాలి నాని సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన సహజ పంథాలోనే దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే..జగన్ మరోసారి కొడాలి నానిపైనే నమ్మకం ఉంచారు.దీంతో గుడివాడలో గెలుపోటములపై తెలుగు తమ్ముళ్లతోపాటు వైసీపీ క్యాడర్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదే జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం గన్నవరం(Gannavaram)లో తెలుగుదేశం జెండా ఎగరాల్సిందేనంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం తరపునే ఎన్నికై వైసీపీ(YCP)లో చేరిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు ఎప్పుడూ తన భావాలు బయటపెట్టని చంద్రబాబు(Chandrababu) సైతం నిగ్రహం, నియంత్రణ కోల్పోయారు. ఆయన వెక్కివెక్కి ఏడ్చేశారు. దీంతో వల్లభనేని వంశీని ఎలాగైనా ఓడించి బుద్ధి చెప్పాలని ప్రతికార్యకర్త కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లే.. గత ఎన్నికల్లో వంశీపై ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao)ను తెలుగుదేశంలో చేర్చుకుని టిక్కెట్ కేటాయించింది. ఇప్పుడు వీరివురిలో పైచేయి ఎవరిదో తేలాల్సి ఉంది.
విజయవాడలోని మూడు సీట్లతోపాటు పెనమలూరు, మైలవరంలోనూ పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయవాడ తూర్పులో గద్దెరామ్మోహన్ హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా... ఆయనపై దేవినేని అవినాశ్ పోటీపడుతున్నారు. గతంలోనూ ఆయన తండ్రి దేవినేని నెహ్రూ ఇక్కడ నుంచే గెలుపొందారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి పాలైన బొండా ఉమ ఈసారి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అతనిపై బలమైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపింది. మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas)పోటీకి దిగనున్నారు.
రాజధాని జిల్లాగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలో పోటీ రంజుగా మారింది. కీలక నేతలు సైతం ఇక్కడ నుంచి పోటీపడుతుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళగిరి(Mangalagiri) నుంచి నారాలోకేశ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయనపై గెలిచి సత్తాచాటిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ(YCP) అధినాయకత్వం ఈసారి మొండిచేయి చూపింది. లోకేశ్‌ను ఢీకొట్టే అభ్యర్థి కోసం విస్తృతంగా మథనం చేసిన వైసీపీ... ముందుగా టీడీపీ నుంచి గంజి చిరంజీవిని లాగేసుకుంది. నేత సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వారికి సీటు ఇవ్వడం ద్వారా లోకేశ్‌కు చెక్‌పెట్టాలని నిర్ణయించింది. అయితే చిరంజీవి అభ్యర్థిత్వాన్ని వైసీపీలో కొందరు వ్యతిరేకించడంతో అదే సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యకు వైసీపీ టిక్కెట్ కేటాయించింది.
అటు రాజధాని నియోజకవర్గామైన తాడికొండలో మరోసారి తెనాలి శ్రావణ్‌కుమార్ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తుండగా...వైసీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. పొన్నూరులో తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dulipaalla Narenda) మరోసారి పోటీపడుతుండగా.... ఆయనపై మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళిని పోటీకి నిలిపింది.
తెనాలి నుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను కూటమి అభ్యర్థింగా రంగంలోకి దింపారు. ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం నేత ఆలపాటి రాజాకు చంద్రబాబు సర్దిచెప్పడంతో ఆయన కూటమి అభ్యర్థి విజయానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనాబత్తుని శివకుమార్‌కు మరోసారి అవకాశం కల్పించింది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు ఓటములు ఎంతో ఆసక్తికరంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మంత్రి విడదల రజనీ(Vidadhala Rajini) వైసీపీ తరపున పోటీచేస్తుండగా.... తెలుగుదేశం సైతం మహిళనే రంగంలోకి దింపింది. ఎంతోమంది ఈ సీటుకోసం పోటీపడినా అనూహ్యంగా స్థిరాస్తి వ్యాపారి పిడుగురాళ్ల మాధవిని అదృష్టం వరించింది. తెలుగుదేశం నేతలంతా కలిసికట్టుగా ఆమెకు సహకరిస్తుండటంతో వివాదం సద్దుమణిగింది.
పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ పోకడలు!
ఈసారి రాజయలసీమ కన్నా అందరి దృష్టి పల్నాడు జిల్లాపైనే ఉంది. రాజయలసీకు మించి ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ మొదలయ్యాయి. బెదిరింపులు, దాడులను దాటుకుని హత్యల వరకు వెళ్లింది. ఈ ఐదేళ్లలోనే దాదాపు డజన్ మందికి పైగా ప్రతిపక్ష నేతలు హతమయ్యారు. లెక్కకు మించి దాడులు జరిగాయి. పలుమార్లు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటినీ చూసుకుంటే ఈసారి పల్నాడులో ఎన్నికలు అంత ఆషామాషీగా సాగేట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లిలో పోటీ నువ్వానేనా అన్నట్లు ఉంది. మాచర్లలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna ReddY) ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు విజయం సాధించి నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆయన దీటైన అభ్యర్థి కోసం తీవ్రంగా అన్వేషించిన టీడీపీ ఎట్టకేలకు పిన్నెల్లికి ప్రత్యర్థిగా ఒడిసిపట్టుకుంది.
ఎట్టకేలకు టీడీపీ పిన్నెల్లికి తగిన అభ్యర్థిని ఎంపిక చేసింది.జూలకంటి బ్రహ్నానందరెడ్డిని బరిలో నిలిపింది. రాజకీయ కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డి రాకతో టీడీపీ వర్గీయుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. అతి సున్నితమైన గ్రామాలన్నీ మాచర్ల నియోజవర్గంలోనే ఉన్నాయి. దీనికి అనుకుని ఉండే మరో నియోజకవర్గం గురజాలలోనూ పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున యరపతినేని శ్రీనివాసరావు బరిలో ఉండగా... వైసీపీ నుంచి కాసు మహేశ్‌రెడ్డి మరోమారు తలపడుతున్నారు.
సత్తెనపల్లిలోనూ ఈసారి పోరు ఢీ అంటే ఢీ అనే విధంగా ఉంది. మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణను ప్రయోగించింది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉండటం కలిసొచ్చే అంశం. ఇక పెదకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ ను తెలుగుదేశం రంగంలోకి దింపింది. ఆర్థికంగా బాగా స్థితిమంతుడైన ప్రవీణ్‌తో లోకేశ్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని సమచారం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకే టిక్కెట్ కేటాయించింది.