Andhra Congress Politics : వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజుకు ఏపీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు - జూలై 8న విజయవాడకు సోనియా, రాహుల్ ?
Sonia Rahul will tour in AP : వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అనే భావన కల్పించేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజును సోనియా, రాహుల్ సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Andhra Congress YSR Politics : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు విభిన్నమైన వ్యూహాలతో తెర ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. వైఎస్ఆర్ ఇమేజ్‌తోనే మళ్లీ జవసత్వాలు పొందేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీ చీఫ్ గా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ పార్టీ బాగానే సంపాదించింది. ఈ క్రమంలో పాత ఓటు బ్యాంకును వెనక్కి తెప్పించుకునేందుకు అతి పెద్ద ఆయుధం వైఎస్ఆర్ ఇమేజేనని నమ్ముతోంది. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఆయనపై ముస్లిం, దళిత వర్గాలు నమ్మకం కోల్పోయే పరిస్థితి రావడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్ 75వ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
జూలై 8వ వైఎస్ఆర్ 75వ జయంతి
వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అరవై ఒక్క ఏళ్ల వయసులో అకాల మరణం పొందారు. ఆయన పుట్టిన రోజు జూలై 8. ఈ ఏడాది ఆయనకు 75వ ఏడు. ఆయన లేనందున ఆయన సంస్మరణగా పుట్టిన రోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న సమయంలో హైదరాబాద్ లోనూ ఓ సారి సంస్మరణ ఏర్పాటు చేశారు. చాలా మంది వెళ్లారు కానీ.. వైసీపీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇప్పుడు సొంతంగా విజయవాడలో నిర్వహించాలని అనుకుంటున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లపై ఓ క్లారిటీకి వచ్చారు.
వైఎస్ఆర్ వారసురాలిగా గుర్తింపు పొందేందుకు షర్మిల ప్రయత్నం
వైఎస్ఆర్‌కు తానే నిజమైన వారసురాలిగా గుర్తింపు పొందేందుకు.. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అని ప్రజలకు తెలియచేసేలా 75వ జయంతి వేడుకల్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి ఇందు కోసం అనుమతి తీసుకున్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ విషయంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. జూలై ఎనిమిదో తేదీన విజయవాడలో భారీ సంస్మరణ కార్యక్రమం పెడతామని సోనియా, రాహుల్ గాందీ రావాలని షర్మిల కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసిన హైకమాండ్ షర్మిలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.దాంతో వారు వైఎస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
వైసీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోయిందని చెబుతూ ఉంటార కానీ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం వల్లనే ఎక్కువగా నష్టపోయిందని.. ఆ పార్టీ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్లిందని రాజకీయ నిపుణులు చెబుతారు. వైఎస్ఆర్ పై అభిమానంతో ఆయన కుమారుడికి అండగా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ ఓటర్లు వెనక్కి వచ్చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ కమార్తె కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని ప్రజల్లోకి సందేశం పంపాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
పలువురు వైసీపీ నేతల చేరికలు
వైసీపీ నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో షర్మిల వైసీపీని పిల్ల కాలువతో పోల్చారు. ఆ పార్టీ నేతలు ఎప్పటికైనా సముద్రం లాంటి కాంగ్రెస్ లో కలవాల్సిందేనన్నారు. వైసీపీ భవిష్యత్ పై నమ్మకం లేని వారిని కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో షర్మిల ఉన్నట్లుగా తెలుస్తోంది.