AP Politics: ఏపీలో తెరపైకి మరో రాజకీయ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రిటైర్డ్ ఐఏఎస్
Andhra Nadi: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...కొత్త కొత్త పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. మరో బ్యూరోక్రాట్ రాజకీయ పార్టీని స్థాపించేశారు.
New Political Party In Ap : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...కొత్త కొత్త పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. మరో బ్యూరోక్రాట్ రాజకీయ పార్టీని స్థాపించేశారు. మొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (LaxmiNarayana)సొంత పార్టీపెట్టారు. తాజాగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించినట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ (Vijay Kumar ) ప్రకటించారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ (Liberation Congress Party )ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అధికజన మహాసంకల్ప సభ
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో పార్టీ పేరును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన, పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. అధిక జనుల ఐక్యతే లక్ష్యమన్న విజయ్ కుమార్, కలిసి వచ్చే నాయకులతో పని చేస్తామన్నారు. పేదల కోసం యుద్ధం చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్, పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోవాలని సవాల్ విసిరారు. దౌర్జన్యంగా పేదల నుంచి భూములు లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చుకున్నారని, సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ తో చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం
విజయ్ కుమార్ వైసీపీలో చేరడం ఖాయమని, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీలో చేరికపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ... కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు విజయ్ కుమార్‌తో...పార్టీ పెట్టించారన్న ప్రచారం జరుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో...దళితుల ఓట్లను చీల్చడానికే పార్టీ పెట్టించారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏపీ సీఎం జగన్ సర్కారులో కూడా కీలక శాఖలకు హెడ్ గా పనిచేశారు. బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లలోనూ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించి....విమర్శల పాలయ్యారు.
మరోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ...కొద్ది రోజు క్రితమే రాజకీయ పార్టీని పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీ అంటూ ఆర్బాటంగా జనంలోకి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న వీవీ లక్ష్మినారాయణ, ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు.
బ్యూరోక్రాట్లు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు...జయప్రకాశ్ నారాయణ సొంతంగా...లోక్ సత్తా అనే ఎన్జీవో సంస్థను స్థాపించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి సక్సెస్ అయ్యార. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ? ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.