BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ ! బీజేపీలో ఎవరా అదృష్టవంతుడు ?
తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి బీజేపీ హైకమాండ్ రాజ్యసభ చాన్సిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. పలువురు నేతలు ఈ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు.
BJP Telugu States Rajya Sabha: తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతల్లో ఇప్పుడు ఓ అంశం హాట్ టాపిక్ అవుతోంది. అదే రాజ్యసభ సీటు. తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ నేతల్లో ఒకరికి ఉత్తరాది నుంచి రాజ్యసభ స్థానం ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ నేతలకు ఎక్కువ చాన్స్ ఉందని చెబుతున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ ఒక కీలక నేతకు ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలు్సతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరికి రాజ్యసభ !
బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ బీజేపీ నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. తమిళనాడు బీజేపీ నేత ఎల్.మురుగన్‌ను మధ్యప్రదేశ్ నుంచి, కేరళకు చెందిన మురళీధర్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపడంతో పాటు వీరిద్దరిని కేంద్రమంత్రులను చేసింది.కేరళ నుంచి సినీనటుడు సురేశ్ గోపిని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసి రాజ్యసభకు పంపింది. ఇదే తరహాలో తెలంగాణ నేత ఒకరిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ సీనియర్లలో ఆశలు !
బీజేపీ సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆయన పలువురు టీడీపీ నేతల్ని బీజేపీలో చేర్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఇతర రాష్ట్రాల నుంచైనా రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని తెలుస్తోంది.
ఏపీ నేతల పేర్లనూ పరిశీలిస్తారా ?
మరో వైపు ఏపీ నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. సుజనా చౌదరి పదవీ కాలం కూడా ముగుస్తోంది. గతంలో జీవీఎల్ నరిసంహారావును యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే ఆయన జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉన్నారు. సుజనా చౌదరి పేరు లేకపోతే.. మరో తెలుగు బీజేపీ సీనియర్ నేత పేరును కూడా పరిసీలించే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. ఈ నెలాఖరుతో రాజ్యసభ నామినేషన్ గడువు ముగియనుంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది . ఎవరికైనా చాన్స్ వస్తుందా లేదా అన్నది ఆ ప్రకటనలో తేలిపోతుంది.