Murder Sketch Politics : "మర్డర్ స్కెచ్" చుట్టూ ఊహించని రాజకీయం !చివరికి ఎవరు ఇరుక్కుంటారు ?
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు " శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర" కేసు చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. స్టీఫెన్ రవీంద్ర సహా అందరికీ లైడిటెక్టర్ పరీక్షలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ స్కెచ్ చుట్టూ రాజకీయాలు చేరాయి. అటు టీఆర్ఎస్ బీజేపీ పై తీవ్ర విమర్శలకు దిగింది. బీజేపీపై కుట్ర పన్నారని ఈ విషయాన్ని ఇంతటితో వదలబోమని కేంద్ర దర్యాప్తు సంస్థల వద్దకు తీసుకెళ్తామని బీజేపీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదేదో పెద్ద గూడుపుఠాణీలా ఉందని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో సహా అందరికీ ఓపెన్ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో అసలు మర్డర్ స్కెచ్ కేసు కన్నా దాని చుట్టూ జరుగుతున్న రాజకీయమే హైలెట్ అవుతోంది.
ఢిల్లీలో కిడ్నాప్‌లు - తెలంగాణలో అరెస్టులు - చివరికి మర్డర్ స్కెచ్ కేసు !
మూడు రోజుల కిందట మాజీ ఎంపీ , బీజేపీ నేతకు చెందిన ఢిల్లీ నివాసం నుంచి నలుగురు కిడ్నాపయ్యారు. ఇలా కిడ్నాప్ అయ్యారని జితేందర్ రెడ్డి సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు. అయితే వారిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వారంతా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు స్కెచ్ వేశారని అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. ఆ మర్డర్ స్కెచ్ ఎవరు వేశారు..? ఎంత సుపారీ ఇస్తామన్నారు ? ఇలా మొత్తం చెప్పారు. రెండు ఆయుధాలను కూడా బయట పెట్టారు. ఇదంతా క్రైమ్ స్టోరీ. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి.
బీజేపీపై కుట్ర చేస్తున్నారంటున్న బండి సంజయ్ !
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై మర్డర్ స్కెచ్ వేసిన వారంతా బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసంలో షెల్టర్ తీసుకోవడం... డీకే అరుణ అనుచరులతోనూ మాట్లాడినట్లుగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పడంతో బీజేపీలో కలకలం రేగింది. గురువారం ఉదయం బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ నివాసానికి బండి సంజయ్ వెళ్లారు. మర్డర్ స్కెచ్ అంశంపై స్పందించారు. జితేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంద్రసేనా రెడ్డి, లీగల్ సెల్ నాయకుడు ఆంటోనీ, ప్రకాశ్ రెడ్డి సమావేశం అయ్యారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి రాష్ట్ర వ్యహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అరతీశారు . డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. కేసును సీబీఐకి ఇవ్వాలని సీబీఐపై నమ్మకం లేకపోతే జ్యూడిషియల్ విచారణకు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై బండి సంజయ్ పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు.
రాజకీయ కుట్రలు చేస్తున్నారన్న జితేందర్ రెడ్డి, డీకే అరుణ !
సీపీ స్టీఫెన్ రవీంద్ర టీఆర్ఎస్ వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. మున్నూరు రవి కి ఆకామిడేషన్ ఇచ్చాను. షెల్టర్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు. మళ్ళీ కూడా ఆకామిడేషన్ ఇస్తాను. నా పీఏ ను కాంటాక్ట్ అయ్యాడు. మున్నూరు రవి మొదటి సారి ఉండలేదు… ఇంతకు ముందు కూడా ఉన్నాడు. మున్నూరు రవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పై ఎలాంటి ఆరోపణలు లేవు. ఇప్పుడు ఆయన మీద జబర్దస్తు గా కేసులు పెట్టారు. శ్రీనివాస్ గౌడ్ ని ఎందుకు మర్డర్ చేయాలని అనుకుంటున్నారుని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్ళంతా టీఆర్ఎస్ కార్యకర్తలేనన్నారు. బీజేపీ ఎదుగుతుంటే నేతల పై కక్షలు తీర్చుకుంటున్నారని .. తన గురించి కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు జితేందర్ రెడ్డి. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది ఒక బోగస్ అని డీకే అరుణ అన్నారు. ఆయనను చంపాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఆయన అవినీతిపై పోరాడుతున్న వారందరికీ తాము షెల్టర్ ఇస్తామని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక ప్రశాంత్ కిశోర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాత్రిపూట ఇంటిపై రాళ్లు వేయడం కాదని... దమ్ముంటే తనపై రాజకీయంగా పోరాడాలని సవాల్ చేశారు.
సైబరాబాద్ కమిషనర్ సహా అందరికీ ఓపెన్ లై డిటెక్టర్ పరీక్షలు జరపాలన్న కాంగ్రెస్ !
సాక్షాత్తు మంత్రినే చంపడానికి కుట్ర జరిగింది కావున.. ఈ ఘటనలో పెద్ద వాళ్ళ పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నేత శ్రవణ్ డిమాండ్ చేశారు.మంత్రిని హత్య చేయడానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకుల పాత్ర ఉందేమో అన్న రీతిలో పోలీసులు వ్యాఖ్యానించడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు.ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ జాతీయ నాయకులతో సహా, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రలను బహిరంగంగా లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.
2Unravel Truth behind #Telangana Minister’s Murder Conspiracy; so called prime suspects #BJP National Leaders Smt @Aruna_DK, @apjithender; Minister @VSrinivasGoud & Cyberabad Police Commissioner @Cpcybd must be subjected 2Lie Detector Test & Launch a @CBItweets Inquiry@ANI pic.twitter.com/77flguEQCY
— Prof Dasoju Srravan (@sravandasoju) March 3, 2022
మొత్తంగా మంత్రి హత్యకు కుట్ర కేసును చేధించడం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.