Musi Politics : రేవంత్ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Telangana : మూసీపై అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమని ఇంకా ప్రకటన రాలేదు. బీఆర్ఎస్ నేతలంతా ఎదురుదాడి చేశారు కానీ అసలైనదానికి సమాధానం ఇవ్వలేకపోయారు.
No announcement yet that BRS is ready to debate Moosi in the Assembly : తెలంగాణ రాజకీయాల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు అనేక మలుపులకు కారణం అవుతోంది. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఒక్కో పని చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే నిర్వాసితులకు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్, బీజేపీ ప్రకటించాయి. అయితే అసెంబ్లీలో చర్చిద్దామని ప్రజలు వద్దనుకుంటే అ ప్రాజెక్టు ఆపేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సవాల్‌గా కాకుండా సూచనలు, సలహాల కోసం అయినా అసెంబ్లీకి రావాలి ప్రతి అనుమానంపైనా చర్చిద్దామన్నారు. రేవంత్ సవాల్‌పై బీఆర్ఎస్, బీజేపీ స్పందన కోసం అంతా ఎదురు చూశారు. బీఆర్ఎస్ నేతలు హరీష్, కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టారు కానీ అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించలేదు.
రేవంత్‌పై ఘాటుగా ఎదురుదాడి చేసిన హరీష్ రావు, కేటీఆర్
రేవంత్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆ సమయంలో తమపై చేసిన విమర్శల విషయంలో హరీష్ రావు, కేటీఆర్ ఘాటు పదాలతో ఎదురుదాడి చేశారు. రాజకీయంగా రేవంత్ చేసిన విమర్శలకు అలాగే కౌంటర్ ఇచ్చారు. రబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలవకుండానే కాంగ్రెస్ మంత్రిని చేసిందన్నారు రేవంత్. తాను మంత్రి అయినప్పుడు తన కారు ముందు రేవంత్ డాన్స్ చేశాడని హరీష్ కౌంటర్ ఇచ్చారు. కానీ అసలు ఈ మాటల యుద్ధానికి కారణమైన మూసి విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధమే అనే ప్రకటన చేయలేదు. కేటీఆర్ కూడా అసలు తామే మూసి ప్రక్షాళన ప్రారంభించామని డాక్యుమెంట్లు ప్రవేశ పెట్టారు. ఇప్పుడు రేవంత్ అవినీతి కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపిస్తున్నారు. మరి ఇదే అసెంబ్లీలో బలంగా వాదించి.. ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు సిద్ధమా అన్న సందేహానికి సమాధానం ఇవ్వలేదు.
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకూ క్లారిటీ !
రాజకీయంగా మాటల దాడులు ఎన్ని చేసుకున్నా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్ కు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న మూసి ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగితే అన్ని అంశాలు సమగ్రంగా ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. మూసి ప్రాజెక్టుపై ప్రధాన పార్టీలు ఏమనుకుంటున్నాయో స్పష్టత వస్తుంది. ప్రజలు కూడా ఆ డిబేట్ చూసిన తర్వాత మూసి ప్రాజెక్టు అవసరమో కాదో నిర్ణయించుకుంటారు. ఒక వేళ అవసరం అయితే.. ప్రక్షాళన చేస్తే సరిపోతుందా..లేకపోతే కేటీఆర్ చెబుతున్నట్లుగా సీవరేజ్ ప్లాంట్లు నిర్మిస్తే సరిపోతుందా ఇవన్నీ అసెంబ్లీలో చర్చించి ఫైనల్ చేయవచ్చు. ప్రజలు కూడా ఓ నిర్ణయానికి వస్తారు.
అసెంబ్లీలో చర్చకు వెనుకాడితే బీఆర్ఎస్‌కే ఇబ్బంది !
అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు మంచి బలం ఉంది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పోలేదు. నోరు నొక్కేయబోమని బీఆర్ఎస్ వాయిస్ ను కూడా గట్టిగా వినిపించేందుకు అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి కూడా హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ తన వాదనను కూడా వినిపించే అవకాశం ఉంది. అయినా మూసీపై చర్చకు అసెంబ్లీకి వస్తారా రారా అన్నది మాత్రం బీఆర్ఎస్ చెప్పడం లేదు. అసలు అభ్యంతరాలేమిటో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో .. ఎంత అవసరమో తేలాలంటే అసెంబ్లీలో చర్చే కీలకం. ఈ చర్చను బీఆర్ఎస్ వద్దనుకుంటే ఆ పార్టీకే మైనస్ అయ్యే అవకాశం ఉంది.